ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలను నిర్దేశించే కులంగా కాపులకు ఉన్న ప్రాధాన్యమే వేరు. ఐతే ఈ కులం పేరు చెప్పి కొందరు నాయకులు మంచి స్థాయికి వెళ్లారు కానీ.. వాళ్లు ఆ కులానికి చేసిందేంటి అనే ప్రశ్న తలెత్తినపుడు సరైన సమాధానాలు రావు. ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి నేతల విషయంలో తరచుగా ఈ ప్రశ్నలు తలెత్తుతుంటాయి. వీళ్లిద్దరూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఈ మధ్య రాసిన లేఖలు, సూచనలు చర్చనీయాంశంగా మారాయి.
టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. 50-60 సీట్లు తీసుకోవాలని.. అధికారంలోకి వస్తే పవన్ ముఖ్యమంత్రిగా కొంత కాలం ఉండేలా డిమాండ్లు చేయాలని వీళ్లిద్దరూ డిమాండ్లు చేసిన వాళ్లే. ఐతే పొత్తులో వాళ్లు కోరినట్లుగా జరగకపోవడంతో ఇద్దరూ పవన్ తీరును తప్పుబడుతూ మళ్లీ లేఖాస్త్రాలు సంధించారు. తాము పవన్ మేలు కోరితే ఆయన మాత్రం తమను పట్టించుకోలేదన్న అసంతృప్తి వారిలో వ్యక్తమైంది.
కట్ చేస్తే కొన్ని రోజులకే హరిరామ జోగయ్య కొడుకు వైసీపీలో చేరిపోయాడు. తాజాగా ముద్రగడ కుటుంబంతో సహా వైసీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీ అగ్ర నేతలు కొందరు ఆయన్ని ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని భావిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోనే ముద్రగడ పోటీలో ఉంటారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ జనసేన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు సలహాలు ఇచ్చిన కాపు పెద్దలు.. వైసీపీలో చేరిపోయారంటూ ఆయన ఎద్దేవా చేశారు. తన మేలు కోరి సలహాలు ఇచ్చినట్లుగా చెప్పిన పెద్దలు ఇప్పుడు వైసీపీలో ఎలా చేరతారని ఆయన ప్రశ్నించారు. కాపు రిజర్వేషన్ లాంటి అంశాలపై నిబద్ధతతో వ్యాఖ్యలు చేస్తే ఓకే కానీ.. పింక్ డైమండ్ తరహాలో మాటలు మారిస్తే ఎలా అని ఆయన ప్రశ్నించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates