నెల్లూరు.. గత ఎన్నికల సమయంలో 10 స్థానాలకు పది సీట్లూ వైసీపీ గెలుచుకుంది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే.. ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ కూడా ఆపార్టీకి దూరమయ్యారు. ఇలాంటి కల్లోల సమయంలో పార్టీ ఇంచార్జ్‌గా ఇక్కడ అడుగు పెట్టారు వేణుంబాక్కం విజయసాయిరెడ్డి. మరి ఆయన ఈ పరిస్థితులను హ్యాండిల్ చేయగలరా? అనేది ప్రశ్న. సాయిరెడ్డి ఎంట్రీతో నెల్లూరు రాజకీయం మరింత వేడెక్కింది.
గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన నెల్లూరులో నమ్మకస్తులు, బలమైన నేతలంతా టీడీపీ వైపు వెళ్లిపోయారు. దీంతో నెల్లూరులో వైసీపీ ప్రయాణం ఇబ్బందిగా మారింది. ఈ దశలో సీఎం జగన్ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. ట్రబుల్ షూటర్ గా ఆ జిల్లాకు స్థానిక నాయకుడైన విజయసాయిరెడ్డిని దాదాపు ఎంపీ అభ్యర్థి(?) గా పంపించారు. అయితే, సాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నా.. ఎప్పటికప్పుడు జిల్లా రాజకీయాలపై ఆయన దృష్టిసారించేవారు.
ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది అనుకున్నా.. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి(వీపీఆర్) పార్టీని వీడటంతో జిల్లాలో అలజడి మొదలైంది. ఆయనతోపాటు చోటామోటా నేతలంతా టీడీపీలోకి వెళ్లిపోయారు. ఈ దశలో పార్టీకి పునర్వైభవం రావాలంటే విజయసాయి అవసరం అని భావించిన జగన్.. ఆయన్ను నెల్లూరు నుంచి లోక్ సభ బరిలో నిలిపారు. ఇప్పటి వరకు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి టీడీపీలోకి వెళ్లడంతో ఆ స్థానానికి కాంపిటీషన్ పెరిగింది. దీంతో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి అనూహ్యంగా బంపర్ ఆఫర్ లభించింది.
ఇటీవల తూర్పు రాయలసీన ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. ఇప్పటికే ఆయన నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా ఉన్నారు. దీనితోపాటు ఆయన్ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. ఓ దశలో నెల్లూరు సిటీ అభ్యర్థిగా చంద్రశేఖర్ రెడ్డి పేరు వినిపించినా.. జగన్ మాత్రం తొలిసారి మైనార్టీలకు అవకాశం ఇచ్చి అక్కడ కూడా తన రాజకీయ చతురత ప్రదర్శించారు.
మొత్తమ్మీద కీలక నేతలంతా చేజారినా నెల్లూరులో పట్టు నిలుపుకోడానికి సీఎం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డితో మంత్రాంగం మొదలు పెట్టారు. నేతలు పార్టీ వీడినా, కేడర్ చెదిరిపోకుండా కాపాడే బాధ్యత విజయసాయికి అప్పగించారు. మరి ఏమరకు ఆయన సరిదిద్దుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates