రేపు ప్ర‌జ‌ల‌ను కూడా తాక‌ట్టు పెట్టేస్తారా !

ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను మాజీ మంత్రి కొడాలి నాని తిప్పికొట్టారు. ఆస్తులు తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయని ప్రశ్నించారు. సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నారని.. నేడు రాష్ట్ర అప్పులు 4లక్షల కోట్లు ఉంటే అందులో 2.50లక్షల కోట్లు చంద్రబాబు చేసినవేనన్నారు. ఏ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే…. చంద్రబాబు రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారా అని ప్రశ్నించారు.

అవసరమైనప్పుడు…. ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలేనని స్పష్టం చేశారు. సచివాలయం అనేది 10 ఎకరాల ఆస్తి మాత్రమేనని కొడాలి తేలిక‌గా తీసేశారు. అంతేకాదు, ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా అని ప్రశ్నించారు. ప్రజల అవసరాల కోసం…ప్రభుత్వ వేసులుబాటును బట్టే ఆస్తులు తాకట్టు పెట్టడం జరుగుతుందని స్పష్టం చేశారు. అంతేకాదు.. రాజ్యాంగంలో ఆస్తులు తాక‌ట్టు పెట్ట‌కూడ‌ద‌ని ఏమైనా రాశారా? అని కూడా ప్ర‌శ్నించారు. బోడి 10 ఎక‌రాల బిల్డింగ్‌ను తాక‌ట్టు పెడితే 420(బాబు)కి ఎందుకు అంత ఉక్రోషం అని ప్ర‌శ్నించారు.

క‌ట్ చేస్తే.. కొడాలి నాని వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు మండి ప‌డుతున్నారు. ప్ర‌జ‌లు కూడా ప్ర‌భుత్వ ఆస్తేన‌ని.. జ‌గ‌న్‌కు ఓటేశార‌ని భావించి.. వారిని కూడా ప్రాంతాల వారీగా తాక‌ట్టు పెట్టేస్తారా? కొడాలి బ్రో! అని వ్యాఖ్యానిస్తున్నారు. మ‌రికొంద‌రు మీరు తాక‌ట్టు పెట్టింది ఒక భ‌వ‌నం కాదు.. రాష్ట్ర స‌చివాల‌యం అనే విష‌యాన్ని గుర్తు పెట్టుకోండి స‌ర్ అని వ్యాఖ్యానించారు. అస‌లు జ‌గ‌న్ క‌ట్టాడా? ఎందుకు తాక‌ట్టు పెట్టాల్సి వ‌చ్చిందో ప్ర‌జ‌ల‌కు చెప్పాలి? అని కొంద‌రు ప్ర‌శ్న‌లు సంధించారు. ఏదేమైనా.. తాజాగా స‌చివాల‌యం తాక‌ట్టు కంటే కూడా.. కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌లు ర‌చ్చ రేపుతుండ‌డంతోపాటు.. వైసీపీకి భారీ డ్యామేజీ చేయ‌డం గ‌మ‌నార్హం.