టీడీపీ, జనసేన పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్‌లు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. బీజేపీతో పొత్తుపై వారు చర్చించేందుకు ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఒకటి ఇప్పటికే బీజేపీతో పొత్తు ఖరారు అయినట్లు చెబుతున్నారు. మరోవైపు చివరి విడత చర్చ ల కోసం వెళ్తున్నారని మరికొందరు అంటున్నారు. ఇదిలావుంటే.. ఆ మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
మార్చి 2వ తేదీన పొత్తులపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శుక్రవారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లేందుకు షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఇరువురు ఉండనున్నారు. బీజేపీ అధినాయ కత్వంతో పొత్తులపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 2న పొత్తులపై చంద్రబాబు, పవన్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.
ఇప్పటికే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తుపై దాదాపు క్లారిటీ వచ్చింది. ఇటీవల టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటన సందర్భంగా బీజేపీతో పొత్తు ఖాయమైందనేలా పవన్ క్లారిటీ ఇచ్చారు. బీజేపీ పొత్తులో కలిసి వస్తుండటం వల్ల తాను సీట్లను తగ్గించుకున్నట్లు పవన్ స్పష్టం చేశారు. తమ పొత్తుకు బీజేపీ ఆశీస్సులు కూడా ఉన్నాయని తెలిపారు. ఇక బుధవారం తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభలో కూడా బీజేపీతో పొత్తు ఉంటుందంటూ పవన్ చెప్పారు. దీంతో మూడు పార్టీల పొత్తు లాంఛనమేనని తెలుస్తోంది.
ఎన్ని సీట్లు?
పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారనేది కీలకంగా మారింది. అసెంబ్లీ కంటే లోక్‌సభ సీట్లను ఎక్కువగా బీజేపీ ఆశిస్తోంది. బీజేపీకి 9 అసెంబ్లీ, 5 లోక్‌సభ స్థానాలు కేటాయించే అవకాశముందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు బీజేపీకి మొత్తంగా 20 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించేలా ఒప్పదం కుదిరినట్లు జాతీయ మీడియా పేర్కొంటోంది. దీంతో అధికారికంగా ప్రకటన వస్తే తప్ప.. దీనిపై క్లారిటీ వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు వైసీపీ అధినేత ఢిల్లీ టూర్ వాయిదా పడినట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.