వైసీపీ విముక్తం కోసమే టీడీపీ-జనసేన పార్టీలు కలిశాయని టీడీపీ చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఆ పార్టీని ప్రజలు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘తెలుగు జన విజయకేతనం’ ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి ఎంతో కీలకమని, వైసీపీ దొంగలపై పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల కోసం కుదిర్చిన పొత్తు తమదని.. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు మాతో చేతులు కలపాలని పిలుపునిచ్చారు.
విజన్ సిద్ధం
2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశామని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ కంటే మిన్నగా రాజధాని ఉండాలని అమరావతికి రూపకల్పన చేశామన్నారు. పోలవరం ద్వారా ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే సంకల్పంతో ముందుకెళ్లామని తెలిపారు. కానీ, రాష్ట్రంలో ఇప్పుడు సైకో పాలన ఉందని, ఏ సీఎం అయినా అభివృద్ధి పనులతో పాలన సాగిస్తారని, కానీ, జగన్ సీఎం అయ్యాక అరాచకాలతో పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని జగన్ అపహాస్యం చేశారని అన్నారు.
జగన్ సొంత చెల్లి మరో పార్టీలో చేరితే సోషల్‌మీడియాలో వేధించారని చంద్రబాబు అన్నారు. జగన్ మానసిక స్థితికి ఈ ఘటనలే నిదర్శనమన్నారు. సైకో నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. జగన్.. 25 ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తెస్తామన్నారు? తెచ్చారా? కుప్పం ప్రాంతానికి నీళ్ల పేరిట జగన్ నాటకాలు వేశారని దుయ్యబట్టారు. ఒక్క రోజులోనే అంతా సర్దుకొని పోయారన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఫ్లాప్ మూవీ
జగన్ పాలన ఒక అట్టర్‌ఫ్లాప్ సినిమా అని చంద్రబాబు విమర్శించారు. అలాంటి సినిమాకి సీక్వెల్ ఉంటుందా? అని ప్రశ్నించారు. టీడీపీ -జనసేన కూటమి సూపర్‌హిట్ అని పేర్కొన్నారు. వైసీపీ గూండాలకు మా సినిమా చూపిస్తామన్నారు. అవసరమైతే ఏ త్యాగాలకైనా తాము సిద్ధమని తెలిపారు. జగన్ తన పాలన కోసం రాష్ట్రాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలుగా విభజిస్తున్నారని ఆరోపించారు. ఏపీని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాలనేదే తమ సంకల్పమని తెలిపారు. “జగన్ ఒక బ్లఫ్ మాస్టర్.. అంటే పదేపదే అబద్ధాలు చెప్పడం.. చేయని పనులు చేసినట్లు చెప్పుకునే వ్యక్తి జగన్‌రెడ్డి” అని విమర్శించారు.
హూ కిల్డ్ బాబాయ్..
హూ కిల్డ్ బాబాయ్..అనేది జగన్‌రెడ్డి జవాబు చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ తన పాలనలో అందరినీ బాధపెట్టాడు, అవమానించాడు .. సినిమా టికెట్ల పేరుతో చిరంజీవి, రాజమౌళిని అవమానించారని అన్నారు. వైనాట్ 175 అని జగన్ అంటున్నాడన్నారు. కొండనైనా బద్ధలు చేస్తామనే ధైర్యం టీడీపీ-జనసేన కూటమి ఇస్తుందన్నారు. టీడీపీ అగ్నికి పవన్ కల్యాణ్ వాయువులా తోడయ్యారని తెలిపారు. తాడేపల్లి గూడెం సభ చూశాక తమ గెలుపును ఎవరూ ఆపలేరని అర్థమైందని అన్నారు. ‘ఇక ఏపీ అన్‌స్టాపబుల్. కూటమి వల్ల కొందరు నేతలు ఇబ్బంది పడి ఉండొచ్చు.. కానీ, పార్టీ కోసం పనిచేసిన అందరికీ న్యాయం చేస్తాం’ అని చంద్రబాబు అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates