వామనుడికి మూడడుగులు..జనసేనకు 24 సీట్లు: పవన్

తాడేపల్లిగూడెంలో జరిగిన ‘జెండా’ బహిరంగ సభలో సీఎం జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను అధ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదు అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ లో శాంతి, మంచితనం , సహనం మాత్రమే చూశారని, ఇకనుంచి మరో పవన్ కళ్యాణ్ ను చూస్తారని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం ఇద్దామని టీడీపీ-జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నమ్మిన వారిని నట్టేట ముంచిన ఏకైక వ్యక్తి జగన్ అని పవన్ దుయ్యబట్టారు. జగన్ కోటను బద్దలు కొట్టేందుకే టీడీపీ-జనసేన కూటమి ఏర్పడిందని పవన్ చెప్పారు. సామాన్యుడు రాజకీయం చేస్తే భరించలేకపోతున్నారని, పదునైన వ్యూహాలు రచించి జగన్ ను గద్దె దించుతామని అన్నారు. కోట్ల ఆదాయాన్ని వదులుకొని ప్రజల కోసం వచ్చానని, రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇక, జనసేన నేతలు, కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పొత్తుల అంశంపై కూడా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలేనని, వ్యూహాన్ని తనకు వదిలేయాలని, తనను నమ్మాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. అంకెలు లెక్కపెట్టవద్దని, ఒక్కో ఇటుక పేర్చి ఇప్పుడు ఇల్లు కడుతున్నానని, తర్వాత కోట కూడా కడతానని పవన్ అన్నారు. పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ సీట్లేనా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని, అయితే వామనుడిని చూసి బలి చక్రవర్తి కూడా ఇంతేనా అన్నాడని, కానీ నెత్తిన కాలు పెట్టి తొక్కితే ఎంతో తెలిసి వచ్చిందని, జగన్ ను అదే రీతిలో అధ:పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని పవన్ ఛాలెంజ్ చేశారు.

ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్లమంది ప్రజలు తిప్పలు పడుతున్నారని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఐదుగురు రెడ్లే పంచాయతీ చేస్తున్నారని విమర్శించారు. వైసీపీలో మిగతా నాయకులకు ఎటువంటి హక్కులు లేవని ఎద్దేవా చేశారు. టీడీపీ-జనసేన నాయకులను, శ్రేణులను వైసీపీ గుండాలు ఇబ్బందులు పెడితే మక్కెలిరగ్గొడతామని పవన్ వార్నింగ్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ లో ఇల్లు కట్టుకున్నప్పటి నుంచి జగన్ బతుకు తనకు తెలుసని అన్నారు.

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ ఉద్దండుడు చంద్రబాబును జైల్లో పెడితే బాధేసిందని, అందుకోసమే కూటమిని తానే ప్రతిపాదించానని స్పష్టం చేశారు. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి అవసరమని, తన నిర్ణయాలు పార్టీ, వ్యక్తిపరంగా ఉండవని చెప్పారు. రాష్ట్ర లబ్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం తాను నిర్ణయాలు తీసుకుంటానని అన్నారు. టీడీపీ-జనసేన పరస్పరం సహకరించుకుంటూ ముందుకు పోతేనే ప్రజల భవిష్యత్తు బాగుంటుందని జనసేన, టీడీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.