“జగన్‌పై పోటీ చేస్తా.. చిత్తుగా ఓడిస్తా”- అని వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య కేసులో నిందితుడు, అప్రూవర్‌గా మారిన దస్తగిరి ప్రకటించాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పాడు. రాజకీయాల కారణంగానే తాను ఇరుక్కు పోయి.. బలి అయిపోయానని.. ఈ నేపథ్యంలో తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి.. తనేంటే చూపిస్తానని ప్రతిజ్ఞ చేశారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన దస్తగిరి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందుల నుంచి పోటీ చేయనున్నట్టు ప్రకటించడం గమనార్హం.
ఓ వ్యక్తిని హత్య చేయబోయాడన్న కేసుపై గత ఏడాది సెప్టెంబరులో పోలీసులు అరెస్టు చేసి దస్తగిరిని జైల్లో పెట్టారు. అయితే.. ఇటీవలే ఆయన బెయిల్ పైన విడుదల అయ్యాడు. ఈ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు తాజాగా హాజరైన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశాడు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నీరుగార్చేందుకు ప్రభుత్వం తనను ప్రలోభాలకు గురి చేస్తుందని దస్తగిరి ఆరోపించాడు. వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అధికారి రాం సింగ్ పై తప్పుడు ఆరోపణలు చేసేలా తనపై ఒత్తిడి చేశారని అన్నారు.
వివేకా కేసు విషయంలో ఏపీలో రాజకీయంగా వైసీపీపై ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి.. ఓట్లు పడని పరిస్థితి ఉంటుందని వైసీపీపై విమర్శలు గుప్పించాడు. తనకు రూ.20 కోట్ల డబ్బులు ఆశ చూపారని దస్తగిరి ఆరోపించాడు. తనను అరెస్టు చేయాలని ఆర్డర్స్ వచ్చాయని.. అందుకు నాంపల్లి కోర్టుకు వచ్చి రీకాల్ పిటిషన్ వేశానని చెప్పాడు. న్యాయమూర్తి కూడా దాన్ని అంగీకరించారని దస్తగిరి అన్నాడు. తెలంగాణ ప్రభుత్వం నుంచి తనకు సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశాడు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని.. స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగుతానని చెప్పాడు.
అయితే.. తనదగ్గర డబ్బులు లేవని.. చందాలు పోగు చేసుకుంటానని వ్యాఖ్యానించాడు. ఇదిలావుంటే, తాను ఎవరికి భయపడేది లేదని చెప్పాడు. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండంటూ సవాల్ విసిరాడు. రాజీకి రావాలని వైసీపీ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని, వివేకా హత్యలో పాల్గొని తప్పు చేశానని, మరోసారి అలాంటి తప్పు చేయదల్చుకోలేదని దస్తగిరి చెప్పాడు.