ఏపీ అసెంబ్లీ ఎన్నికల పొత్తులో భాగంగా జనసేనకు టీడీపీ 24 అసెంబ్లీ స్థానాలు మాత్రమే కేటాయించడంపై జనసైనికుల్లో ఒక వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సీట్ల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండాలని, పవర్ షేరింగ్ కూడా ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లోనూ రచ్చ నడుస్తోంది. ఐతే ఈ విషయంలో టీడీపీని విమర్శిస్తూ.. పవన్ కళ్యాణ్‌ను కూడా తప్పుబడుతున్న వారికి ప్రొఫెసర్ నాగేశ్వర్ క్లాస్ పీకారు. ఒక టీవీ ఛానెల్లో సీట్ల పంపకంపై ఆయన ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఆయన ఏమన్నారంటే..
‘‘సీట్ల పంపకం విషయమై నిలదీసే వాళ్లెవ్వరూ పవన్ కళ్యాణ్ శ్రేయోభిలాషులు కారు. నిలదీసేవాళ్లు గతంలో భీమవరానికి వెళ్లి ప్రచారం చేశారా? అక్కడ ఆయన గెలుపు కోసం పని చేశారా? ప్రాథమిక విషయం ఏంటంటే.. టీడీపీకి జనసేన అవసరం ఉన్న మాట వాస్తవం. దాని వల్ల బార్గైనింగ్ చేసుకునే అవకాశం జనసేనకు ఉంది. కానీ అది ఎన్నికలకు ముందు కాదు.. తర్వాత. కానీ ముందు ఎన్నికల్లో గెలవాలి కదా? ఎక్కువ సీట్లు జనసేనకు ఇచ్చారు అనుకుందాం. కానీ గెలవాలి కదా? గెలవకపోతే? అంతిమంగా గెలవడం ప్రధానం.
సీట్లు ఇచ్చిన చోట జనసేనకు బలం లేకపోతే ఏంటి పరిస్థితి? పవన్ కళ్యాణ్ కష్టకాలంలో టీడీపీకి అండగా నిలిచాడు కదా. జనసేన మద్దతు లేకుంటే టీడీపీ ఇప్పుడున్న స్థితికి వచ్చేది కాదు కదా.. ఇవన్నీ నిజం. ఈ ప్రాతిపదికన బలం లేని చోట సీట్లు ఇచ్చారనుకుందాం. అక్కడ గెలుస్తారా? 2004లో యూపీఏ ప్రభుత్వం వామపక్షాల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. అందుకు బదులుగా యూపీలోనో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనో పది పదిహేను సీట్లు ఇస్తే వామపక్ష పార్టీలు గెలుస్తాయా? ఎన్నికలకు వచ్చేసరికి అవసరాలు ముఖ్యం కాదు. గెలుపు అవకాశాలు అనేది ముఖ్యం. ఒక పార్టీ అవసరం ఒక పార్టీకి ఉండొచ్చు. అంతిమంగా గెలవగలిగే అవకాశం ఏ పార్టీ అభ్యర్థికి ఎక్కువ ఉందన్నదాన్ని బట్టి సీట్ల సర్దుబాటు ఉంటుంది. ఎన్నికలకు వేరే ప్రాతిపదిక ఉండదు.
ఎన్నికల తర్వాత 70 సీట్లు టీడీపీకి, 20 సీట్లు జనసేనకు వస్తే.. తమ మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాబట్టి కుమార స్వామి లాగా సగం రోజులు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అడగవచ్చు. కానీ అది కూడా నైతికం కాదు. ఎన్నికల ముందు మాత్రం గెలుపు అవకాశాలు మాత్రమే ప్రాతిపదిక. ఎన్నికలకు ముందు సీట్ల గురించి, పవర్ షేరింగ్ గురించి లేఖలు రాసి నిరసన వ్యక్తం చేసేవాళ్లు ఎవ్వరూ జనసేన మంచి కోరుకునే, ఆ పార్టీ విజయాన్ని కాంక్షించే వారు కాదు. గత పర్యాయం పవన్ కళ్యాణ్ పార్టీ ఒక్క సీట్ గెలిచాడు. ఈసారి ఎన్ని గెలుస్తాడని వీళ్ల అంచనా? 30, 40, 50 గెలుస్తాడా?’’ అని నాగేశ్వర్ అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates