ఆస్తులు అమ్ముకుంటున్న పవన్ కళ్యాణ్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవా భావం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సైన్యంలో పోరాడి ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కోసం, ఆరుగాలం కష్టపడే రైతుల కోసం ఆయన తన ఆదాయం నుంచి ఎన్ని కోట్లు ఇచ్చారో చూస్తూనే ఉన్నాం. రాజకీయాల్లోకి వచ్చిన వాళ్లు ఎలా సంపాదిద్దాం అనే చూస్తారు కానీ.. చేతిలో ఎముక లేని విధంగా జనం కోసం డబ్బులు ఇచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. కొన్ని రోజుల కిందటే జనసేన పార్టీ కోసం తన సొంత ఆదాయం నుంచి పది కోట్లు విరాళంగా ఇవ్వడం పవన్ కళ్యాణ్‌కే చెల్లింది. ప్రత్యర్థి పార్టీల వాళ్లు ప్యాకేజీ ప్యాకేజీ అంటూ అర్థం లేని ఆరోపణలు చేస్తుంటారు కానీ.. పవన్ ఎంతటి నిజాయితీ పరుడో జనాలకు తెలుసు.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవలేం అనే సంకేతాలను ఇస్తున్న పవన్.. కనీసం తమ వెంట తిరిగే వాళ్లు అన్నం, టీలు అయినా ఇవ్వాల్సిందే అని ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఖర్చుల కోసం పవన్ ఆస్తులు అమ్ముకుంటున్నట్లుగా మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వారం కిందటే పవన్ హైదరాబాద్‌లో ఒక ఖరీదైన స్థలాన్ని అమ్మేశాడట. ఇంకో రెండు మూడు ఆస్తులను కూడా ఆయన అమ్మకానికి పెట్టినట్లు టీవీ ఛానెళ్లలో స్క్రోలింగ్స్ వస్తున్నాయి. ఈ అప్‌డేట్ చూసి జనసైనికులతో పాటు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రాజకీయాల్లోకి వచ్చి వందలు, వేల కోట్లు సంపాదించేవాళ్లనే చూశాం కానీ.. ఇలా ఆస్తులు అమ్ముకుని రాజకీయాలు చేసేవాళ్లు అరుదు అని అభిప్రాయపడుతున్నారు. కొందరు జనసైనికులు ఈ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు. ఇలాంటి పరిణామాలు చూసి అయినా.. పవన్‌ను విమర్శించే వాళ్లు మారాలని అభిప్రాయపడుతున్నారు.