ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన.. తొలి ఎన్నికల సభ ఫుల్లుగా సక్సెస్ అయిందనే భావన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అనంతపురంలో సోమవారం రాత్రి నిర్వహించిన న్యాయ సాధన సభ ఆ పార్టీలో జోష్ నింపింది. అయితే.. అదేసమయంలో ప్రధాన ప్రతిపక్షాలు సహా అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ఇప్పటి వరకు.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలితే.. తాము లబ్ధి పొందుతామని.. ప్రతిపక్షాలు అంచనా వేసుకున్నాయి.
అదేసమయంలో అధికార పార్టీ కూడా.. ఎవరు వచ్చినా.. తమ ఓటు బ్యాంకు చీలదని అంచనాలు వేసు కుంది. కానీ, షర్మిల నేతృత్వంలో నిర్వహించిన సభకు దాదాపు 20 వేల మంది పైచిలుకు జనాభా హాజరయ్యారు. వాస్తవానికి ఈ సభను స్థానిక నాయకులు లైట్ తీసుకున్నారు. ఏం పుంజుకుంటుందిలే.. అనుకున్నారు. అందుకే.. కేవలం రెండు రోజుల ముందు మాత్రమే ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే.. షర్మిల దాదాపు తన కుమారుడి వివాహం నేపథ్యంలో వారానికిపైగా రాష్ట్రానికి దూరంగా ఉన్నారు.
దీంతో కీలక నాయకులు కూడా.. పెద్దగా పట్టించుకోలేదు. అయినప్పటికీ.. 20 వేల మంది హాజరయ్యారని అంచనా ఉంది. ఇక, పట్టుదలతో కూర్చుని ప్రయత్నాలు చేస్తే.. మున్ముందు సభలకు జనస మీకరణ చేస్తే.. ఈ సంఖ్య మూడు రెట్లు పెరిగినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. త్వరలోనే విశాఖలో భారీ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంతకు మించి జనాలను తరలించేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ జోష్ పెరుగుతున్నదనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.
మరోవైపు.. కాంగ్రెస్ ఇలా బలపడుతూ.. పోతే.. క్షేత్రస్థాయిలో ఓట్లు చీలడం ప్రారంభమై.. కాంగ్రెస్‌కు సంస్థాగతంగా ఉన్న ఓటు బ్యాంకు వైసీపీకి దూరమవుతుంది. దీని వల్ల కనీసంలో కనీసం 20 సీట్లపై ప్రభావం పడుతుందనే అంచనా వస్తోంది. ఇదేసమయంలో ఓట్లు చీలడం ప్రారంభమైతే.. ఇది తమకు ఎఫెక్ట్ అని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు షర్మిల జగన్‌ను మాత్రమే టార్గెట్ చేయగా.. ఇప్పుడు టీడీపీని కూడా టార్గెట్ చేస్తుండడం గమనార్హం. దీంతో ఈ పార్టీ నాయకులు కూడా అంతర్మథనంలో పడిపోయారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.