10 వేల కోట్లపైన కన్నేసిందా ?

రేవంత్ రెడ్డి ప్రభుత్వం రు. 10 వేల కోట్ల పై కన్నేసింది. అర్జంటుగా ప్రభుత్వానికి ఆదాయాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ హామీలను అమలుచేయాలంటే ఏడాదికి రు. 1.53 లక్షల కోట్లు అవసరం. అయితే అంతటి ఆదాయం ప్రభుత్వానికి లేదన్నది వాస్తవం. అందుకనే మొన్నటి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం సిక్స్ గ్యారెంటీస్ హామీల అమలుకు కేటాయించింది రు. 43 వేల కోట్లు మాత్రమే.

ఈ కేటాయింపులను చూస్తే రేవంత్ ప్రభుత్వం గ్యారెంటీల అమలుకు ఎంత ఇబ్బందులు పడుతోందో అర్ధమవుతోంది. అందుకనే అర్జంటుగా ఆదాయాలను పెంచుకోకపోతే చాలా కష్టమని అర్ధమైపోయింది. అర్జంటుగా ఆదాయాలను పెంచుకోవాలంటే ప్రభుత్వం ముందున్న మార్గాలు కొన్నే. అవేమిటంటే ప్రభుత్వ భూములను వేలం వేయటం. భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేయటం. ఎక్సైజ్ అమ్మకాలను పెంచుకుని ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవటం. ఇవికాకుండా మిగిలిన మరో మార్గం ఏమిటంటే మున్సిపల్ పన్నులు పెంచటంతో పాటు నిబంధనలను అతిక్రమించి నిర్మించుకున్న కట్టడాలను రెగ్యులర్ చేయటం.

అందుకనే ప్రభుత్వం బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్(బీఆర్ఎస్), లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ(ఎల్ఆర్ఎస్) వెసులుబాటును తీసుకొచ్చింది. అవసరమైనపుడల్లా స్కీమ్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించి ఫీజులు కట్టించుకుని అక్రమాలను సక్రమాలు చేయటమే. ఇందులో భాగంగానే ఇపుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ కు ప్రభుత్వం తెరలేపింది. ఈ స్కీమ్ లో ప్రభుత్వానికి తక్కువలో తక్కువ రు. 10 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఎలాగంటే స్కీమ్ ను కేసీయార్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 2020లోనే తెచ్చారు. అయితే ఎందుకనో ప్రభుత్వం అమలును పట్టించుకోలేదు. దాంతో సుమారు 25 లక్షల దరఖాస్తులు పెండింగులో ఉండిపోయాయి. గ్రేటర్ మున్సిపల్ పరిధిలోనే లక్షకుపైగా దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. కొంతకాలంగా తెలంగాణాలో రియల్ ఎస్టేట్ బూమ్ విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇపుడు తెచ్చిన స్కీమ్ లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 31వరకు రేవంత్ ప్రభుత్వం గడువు విధించింది. అంటే ఇప్పటికే పెండింగులో ఉన్న సుమారు 25 లక్షల దరఖాస్తులకు మరికొన్ని యాడ్ అవటం ఖాయం. కాబట్టి వీటన్నింటినీ పరిష్కరిస్తే వేలాది కోట్ల రూపాయల ఆదాయం రావటం ఖాయం.