‘కేసీఆర్ బతికే ఉన్నాడు.. ఏం కానీయుడు..’

తియ్యటి మాటలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. కరోనా గురించి దేశ ప్రజలకు.. మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలకు పెద్దగా తెలీని వేళలో.. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటల క్లిప్పులు గడిచిన కొద్దినెలలుగా వాట్సప్ గ్రూపుల్లో తరచూ షేర్ కావటం తెలిసిందే. చాలా సింఫుల్ వైరస్ అన్నట్లుగా తేల్చేయటమే కాదు.. ఉష్ణోగ్రతలు కాస్త పెరగ్గానే.. కరోనా వైరస్ తోక ముడిచి పారిపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇప్పటివరకు అందరికి ఎదురైన అనుభవం చూస్తే.. సారు ఇలా కూడా మాట్లాడతారా? అన్న సందేహం రాక మానదు.

అంతేకాదు.. కరోనా అంతు చూసేందుకు తమ ప్రభుత్వం వెనక్కి తగ్గేదేలేదని.. మాస్కు పెట్టుకోకుండానే పని చేస్తామని అప్పట్లో సవాలు విసిరిన కేసీఆర్.. పనిలో పనిగా వెయ్యి కోట్ల ఖర్చు పెట్టేందుకైనా తాము సిద్ధమని తేల్చేయటం తెలిసిందే. కేసుల తీవ్రతతో పాటు.. వైద్యం కోసం ప్రజలు పరుగులు తీయటం.. ప్రైవేటు దవాఖానాల్లో బెడ్లు లేక రోడ్ల మీదనే ప్రాణాలు విడిచిన ఉదంతాల గురించి తెలిసిందే.

గతంలో వెయ్యి కోట్లు ఖర్చుకైనా వెనుకాడేది లేదని తేల్చేసిన కేసీఆర్.. తాజాగా మళ్లీ అదే అసెంబ్లీలో కరోనాను కంట్రోల్ చేయటం కోసం రూ.10వేల కోట్లు అయినా ఖర్చుకు వెనుకాడమని చెప్పేసిన వైనం వింటే కడుపు నిండిపోతుందంతే. ఉత్పాతం వస్తే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తామా? అని ప్రశ్నించిన కేసీఆర్.. చావుల మీద రాజకీయం ఏమిటంటూ తనదైన శైలిలో మండిపడ్డారు.

కరోనా ప్రపంచానికే విపత్తు అని.. అందులో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యంగా మాట్లాడొద్దన్న ఆయన.. విమర్శలు చేసేవారికి తనదైన శైలిలో పంచ్ లు వేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కేసీఆర్ బతికే ఉన్నాడని.. ఏం కానీయడన్న ఆయన.. అవసరమైతే రూ.10వేల కోట్లు ఖర్చుకు వెనకాడమన్నారు. అంత ఖర్చు ముచ్చట తర్వాత.. ముందు గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన టిమ్స్ ను పూర్తిస్థాయిలో రన్ చేసి పుణ్యం కట్టుకుంటే బాగుంటుంది కదా కేసీఆర్?