పవన్ కే షాకిచ్చారా ?

జనసేన నేతలు అధినేత పవన్ కల్యాణ్ కే షాకిచ్చారా ? అవుననే అంటున్నాయి పార్టీవర్గాలు. విషయం ఏమిటంటే మూడురోజుల క్రితం విశాఖపట్నంలో భీమిలి, యలమంచిలి, పెందుర్తి, గాజువాక నియోజకవర్గాలకు సమన్వయకర్తలను పవన్ ప్రకటించినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్నే నిజమని నమ్మిన మీడియా కూడా విస్తృతంగా ప్రచారం కల్పించింది. మీడియాలో వచ్చిన వార్తలు చూసి పవన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారట. కారణం ఏమిటంటే పవన్ అసలు ఎవరినీ సమన్వయకర్తగా ప్రకటించలేదట.

తాను చేయని నియామకాలను తన పేరుతోనే పార్టీలో ఎవరు ప్రచారం చేశారు ? దాన్ని మీడియాలో ఎవరు హైలైట్ చేయించారనే విషయమై పవన్ వాకబు చేశారట. వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత ఈ ప్రచారానికి కారణం ఇద్దరు నేతలని గుర్తించారట. వైసీపీలో నుండి జనసేనలో చేరిన ఎంఎల్సీ వంశీ కృష్ణ శ్రీనివాసయాదవ్, సుందరపు సతీష్ గా తేలిందట. వంశీ భీమిలీలో, సతీష్ ఎలమంచిలిలో పోటీచేయాలని బాగా పట్టుదలగా ఉన్నారట. తామిద్దరం పై నియోజకవర్గాల నుండి పోటీచేయబోతున్నట్లు వీళ్ళు ప్రచారం కూడా చేసుకుంటున్నారట.

ఒకవైపు ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తుండటం, మరోవైపు పొత్తులు, సీట్ల సర్దబాట్లు తేలకపోవటంతో నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. అందుకనే వీళ్ళిద్దరు అడ్వాన్స్ అయిపోయి తమకు తామే ఇన్చార్జిలుగా చెప్పేసుకుంటు పవన్ నియమించినట్లుగా ప్రచారంలోకి తెచ్చినట్లు గుర్తించారు. తమను మాత్రమే సమన్వయకర్తలుగా నియమించారంటే గొడవలైపోతాయని మరో ఇద్దరి పేర్లను కూడా జతచేశారట. దాంతో వ్యవహారమంతా బాగా గబ్బుపట్టిపోయింది. మరిపుడు తాను చేయని నియామకాలను చేసినట్లుగా ప్రచారానికి కారణమైన వాళ్ళపై పవన్ ఏమి యాక్షన్ తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

తాజాగా బయటపడిన వివాదంతో ఇప్పటివరకు జనసేన తరపున కొన్ని నియోజకర్గాల్లో సమన్వయకర్తలుగా ప్రచారంలో ఉన్న వారిపైన కూడా అనుమానాలు మొదలయ్యాయి. ఎప్పుడైతే విశాఖ జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో జనసేన సమన్వయకర్తలను నియమాకం జరిగిందని ప్రచారం మొదలైందో వెంటనే టీడీపీ నేతల నుండి తీవ్రస్ధాయిలో అభ్యంతరాలు లేచాయి. దాంతో రెండుపార్టీల్లోను గందరగోళం పెరిగిపోతోంది. ఎన్నికలకు ముందు ఇలాంటి గందరగోళాలు రెండుపార్టీలకు ఏమాత్రం మంచివికావని పవన్ అనుకుంటున్నారట. అందుకనే ఇలాంటి ప్రచారాలకు వీలైనంత తొందరలోనే ఫులిస్టాప్ పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం.