శాసన మండలిలో తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. మండలిలో లడ్డూ ఇష్యూపై వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ విషయంపై చర్చిస్తున్న సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆవేశపూరితంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే మండలి ఛైర్మన్ మోషేస్ రాజు, వైసీపీ అధినేత జగన్ క్రిస్టియన్లు అంటూ స్పీకర్ ఛైర్ ను చూపిస్తూ అచ్చెన్న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
అచ్చెన్న వ్యాఖ్యలను స్పీకర్ మోషేస్ రాజు తీవ్రంగా తప్పుబట్టారు. తన మతం, కులం గురించి సభలో ఎందుకు ప్రస్తావించారని అచ్చెన్నను నిలదీశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని మోషేస్ రాజుతోపాటు వైసీపీ సభ్యులు డిమాండ్ చేశారు.
అయితే, మోషేస్ రాజు క్రిస్టియన్ కాదు అని చెబితే తాను ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటానని అచ్చెన్న అన్నారు. దీంతో, తాను హిందూ అని మోషేస్ రాజు అన్నారు. ఆ తర్వాత అచ్చెన్న తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. తాను ఎప్పుడూ భేషజాలకు పోనని అన్నారు.
అయితే, వారు క్రిస్టియన్లు అని, తాను తప్పుబట్టడం లేదని, తప్పుపట్టకూడదు కూడా అని అంటూనే అచ్చెన్న చేసిన కామెంట్ల కాంట్రవర్సీకి దారి తీశాయి. వెంకటేశ్వర స్వామి మీద ఇంత కక్ష పెట్టుకుంటారని తాను అనుకోలేదని, తాను ఒక భక్తుడిగా లడ్డూ కల్తీపై ఆవేదన చెంది మాట్లాడుతున్నానని చెప్పారు.
ప్రస్తుతం అచ్చెన్న్ కామెంట్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, స్పీకర్, వైసీపీ అధ్యక్షుడు జగన్ లు క్రిస్టియన్లు అంటూ మతం గురించి అచ్చెన్న ప్రస్తావించి ఉండకూడదు. సభా గౌరవానికి భంగం కలిగేలా స్పీకర్ చైర్ వైపు చేతులు చూపిస్తూ అచ్చెన్న అలా వ్యాఖ్యానించడం సరికాదు. ఈ తరహా వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశముంది. ఇటువంటి కామెంట్ల వల్ల లడ్డూ కల్తీ వ్యవహారం పక్కదోవ పట్టే అవకాశముంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates