మిగిలిన రాజకీయ అధినేతల వ్యూహాలకు ఏ మాత్రం సంబంధం లేని రీతిలో.. ఆ మాటకు వస్తే.. నిత్యం చూసే రాజకీయ ఎత్తులకు భిన్నంగా మోడీషాల వ్యూహాలు ఉంటాయని చెప్పాలి. ఏపీలోని ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ఆ రాష్ట్ర అధికార పార్టీకి చెందిన ఎంపీ రఘురామను సంధించటం.. తాజాగా మహారాష్ట్రలో తమకు ఏ మాత్రం పొసగని సేన సర్కారుకు షాకులిచ్చే పెద్ద పనిని బాలీవుడ్ క్వీన్ కంగన చేతుల్లోకి తీసుకున్నారా? అన్న భావన కలుగక మానదు.
ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే.. పలు సందేహాలు కలుగక మానవు. బాలీవుడ్ లో అంతమంది పేరు మోసిన నటీనటులు ఉన్నప్పటికీ.. మిగిలిన వారికి భిన్నంగా కంగనా రౌనత్ వ్యవహారశైలి ఇప్పుడు కొత్త సందేహాలకు తావిచ్చేలా మారటమే కాదు.. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తావించినట్లు మహారాష్ట్రకు కంగనా సీఎం అవుతారా? అన్న సందేహం కలిగేలా పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ సూసైడ్ ఉదంతంలో మహారాష్ట్ర పోలీసుల విచారణను తాను నమ్మలేనని చెప్పటం ద్వారా కంగనా కలకలం రేపారు. అప్పటి నుంచి ఆమెకు.. మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్య లడాయి నడుస్తోంది. తాజాగా అది మరోస్థాయికి వెళ్లినట్లుగా చెప్పాలి. సేన సర్కారు మరాఠీ సెంటిమెంట్ ను తెర మీదకు తీసుకొస్తే.. కంగన సైతం ఏ మాత్రం తగ్గకుండా ధీటుగా బదులిస్తున్నారు.
ముంబయికి తాను రాకుండా ఎవరు ఆపలేరన్న ఆమె.. అన్నట్లే ముంబయికి వచ్చారు. అయితే.. ఆమె ఉండే నివాసం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొంటూ కూల్చివేయటం తెలిసిందే. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. సేన సర్కారుకు శాపనార్థాలు పెట్టటమే కాదు..తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యింది. ఈ క్రమంలో ఆమె అనూహ్యంగా కశ్మీరీ పండిట్లను ప్రస్తావించటం ఈ వ్యవహారం మరో కోణంలోకి వెళ్లేలా చేశారు.
తన ఇంటిని కూల్చినందుకు ఆనందపడుతున్నారన్న ఆమె.. ‘‘మీ అహంకారం కూలే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. కశ్మీర్ పండితుల బాధేంటో నాకీ రోజు అర్థమైంది’’ అని పేర్కొనటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఉన్న ఇంటిని కూల్చేసి.. ఇంట్లో ఉండనీయకుండా చేసిన వైనాన్ని.. అప్పట్లో కశ్మీరీ వ్యాలీలో పండిట్లకు ఎదురైన దారుణ అనుభవంతో పోల్చటం ద్వారా కంగన భారీగా సానుభూతిని సొంతం చేసుకున్నారని చెప్పాలి.
అంతేకాదు.. సేన సర్కారు తీరును తీవ్రంగా తప్పు పట్టిన ఆమె.. ‘‘బాబర్.. అతని సైన్యం’’ అని పేర్కొంటూ బీఎంసీ సిబ్బందిని పేర్కొన్నారు. ఇదంతా చూస్తుంటే.. త్వరలోనే ఈ క్వీన్ బాలీవుడ్ ను వదిలేసి.. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? అన్న సందేహం కలిగేలా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పక తప్పదు.