ఏపీలో అసెంబ్లీఎన్నికలకు సమయం చేరువ అవుతున్న నేపథ్యంలో పార్టీ వ్యూహ ప్రతివ్యూహాల్లో తలమున కలుగా ఉన్నాయి. ప్రత్యర్థి పార్టీలు వేసే అడుగులకు.. చెక్ పెడుతూ.. నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో వైసీపీ వర్సెస్ టీడీపీల మధ్య పోటీ.. మరింత వేగంగా ఉంది. తాజాగా ఉమ్మడి కృష్నా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం.. పెనమలూరు నుంచి వైసీపీ ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. పొరుగున ఉన్న పెడన ఎమ్మెల్యే కమ్ మంత్రి జోగి రమేష్‌ను తీసుకువచ్చి.. ఇక్కడ ఇంచార్జ్ గా నియమించారు.
దీంతో టీడీపీ డిఫెన్స్‌లో పడింది. ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో టీడీపీ తరఫున కమ్మ సామాజిక వర్గా నికి చెందిన బోడే ప్రసాద్ పోటీ చేస్తూ వస్తున్నారు. 2014లో ఆయన విజయం దక్కించుకున్నారు, 2019లో ఓడిపోయారు. ఈ సారి.. ఇక్కడ మారిన సమీకరణల నేపథ్యంలోవైసీపీని బలంగా ఎదుర్కొనే విషయంపై కొన్నాళ్లుగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త పేరు తెరమీదికి వచ్చింది. తెలుగు సినీ రంగంలో సూపర్ స్టార్‌గా వెలుగొందిన నటశేఖర కృష్ణ సోదరుడు.. ఆదిశేషగిరి రావును బరిలో దింపాలని భావిస్తున్నట్టు తాజాగా వెలుగు చూసింది.
ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కమ్మసామాజిక వర్గానికి చెందిన నాయకుడు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ కూడా చేశారు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత.. వైసీపీ చెంతకు చేరారు. ఆయనకు ఇక్కడ ఆశించిన మేరకు ప్రాధాన్యం దక్కలేదు. దీంతో రెండు సంవత్సరాలుగా వైసీపీకి ఆయన దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆది శేషగిరిరావునుబరిలో నిలపడం ద్వారా.. వైసీపీకి గట్టి షాక్ ఇవ్వచ్చనేది.. టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు..ఆయన రాకతో.. కమ్మ సామాజిక వర్గం పూర్తిగా తమ వెనుకే ఉంటుందని కూడా లెక్కలు వేస్తున్నట్టు సమాచారం.
కృష్ణ కుటుంబానికి.. ఆది నుంచి కూడా.. టీడీపీ ప్రాధాన్యం ఇస్తోంది. ఆయన సొంత అల్లుడు.. గల్లా జయదేవ్‌కు.. 2014 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఆయన విజయం దక్కించుకున్నారు. 2019లోనూ ఇదే సీటు కేటాయించారు. మరోసారి వైసీపీ హవాను ఎదిరించి మరీ గెలుపు గుర్రం ఎక్కారు. ఇటీవల గల్లా రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. దీంతో కృష్ణ కుటుంబానికే చెందిన ఆదిశేషగిరిరావుకు ఈ దఫా ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.