టార్గెట్ @14 : రేవంత్ మ‌రిన్ని నిర్ణ‌యాలు

పార్ల‌మెంటు ఎన్నిక‌లే ల‌క్ష్యంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నా రు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 17 స్థానాల‌కు గాను.. 14 చోట్ల విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌ని నిర్ణ‌యించుకున్న సీఎం రేవంత్‌.. దీనికి సంబంధించి వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్ర‌మంలో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల్లో మ‌రో రెండు హామీల‌ను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీలో ఈ మేర‌కు నిర్ణ‌యించారు.

ఉప సంఘం నిర్ణ‌యం మేర‌కు.. గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాల అమలుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ 2 పథకాలు ఈ నెల 27 లేదా 29న ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధి విధానాలపై భేటీలో కీలకంగా చర్చించారు. గ్యాస్ ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. సబ్సిడీ ఎలా అందించాలనే అంశంపైనా చర్చించారు. కేబినెట్ సబ్ కమిటీ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని అన్నారు.

స‌బ్సిడీని లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా, లేదా ఏజెన్సీలకు చెల్లించాలా? అనే విషయంపై చర్చించారు. అనుమానాలు, అపోహలకు తావు లేకుండా పథకాలు అమలు చేయాలని నిర్దేశించారు. అలాగే, గృహ జ్యోతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలన్నారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్ బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ ఈ పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సూచించారు.

వారంద‌రికీ 200 యూనిట్లు..

తెల్ల రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్లలోపు గృహ విద్యుత్ వినియోగించే వారందరికీ గృహ జ్యోతి.. పథకం వర్తింపచేయాలని సీఎం రేవంత్‌ స్పష్టం చేశారు. ప్రజాపాలన దరఖాస్తుల్లో రేషన్ కార్డు నెంబర్, విద్యుత్ కనెక్షన్ నెంబర్ తప్పుల కారణంగా జీరో బిల్లుకు అర్హత కోల్పోయిన వారు ఉంటే.. అలాంటి వారికి తప్పులు సవరించుకునే అవకాశం ఇవ్వాలని సూచించారు. అలాగే, ప్రజాపాలన దరఖాస్తు నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సూచించారు. ఇక‌, ఈ ప‌థ‌కాల అమ‌లుతో ఆ వెంట‌నే పార్లమెంటు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రానుంది. ఫ‌లితంగా.. సామాన్య ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్ పాల‌నపై ఒక రేంజ్‌లో గుర్తింపు తేవాల‌ని రేవంత్ భావిస్తున్న‌ విష‌యం స్ప‌ష్టంగా తెలుస్తోంది.