రానున్న పార్లమెంటు ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో భారీగా స్థానాలు కైవసం చేసుకోవాలని భావిస్తున్న రేవంత్‌రెడ్డి తాజాగా అభ్యర్థిని ప్రకటించేశారు. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న సమయంలో రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి బహిరంగ సభలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని ఆయన ప్రకటించారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి పేరును ఆయన ప్రకటించారు.
వంశీచంద్ రెడ్డిని మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, అందుకు తన నియోజకవర్గం కొడంగల్ నుంచే 5వ వేల మెజార్టీ రావాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గానూ 14 సీట్లలో కాంగ్రెస్ నెగ్గి రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో పోరాటం చేస్తుందన్నారు. వచ్చే వారం రోజుల్లో రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుపై ప్రకటన చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెల 16లోగా అందరికీ రైతు భరోసా అందిస్తామని భరోసా ఇచ్చారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని చెప్పారు.
వంశీ ఎవరంటే..
చల్లా వంశీ చంద్ రెడ్డి కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఎల్ఏగా గెలుపొందారు. విద్యార్థి దశ నుండే ఉన్న ఆసక్తితో వంశీచంద్ రెడ్డి రాజకీయాల్లో వచ్చారు. 2014లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఓటమిచెందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి చేతిలోనూ పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శి హోదాలో మహారాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహాయకుడిగా, జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత వ్యవహారాల బాధ్యతలను నిర్వహించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates