లోకేష్ వార్నింగ్.. 40 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలుకు

తెలుగుదేశం యువ నేత, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడి త‌న‌యుడు నారా లోకేష్‌ నెమ్మ‌దిగా దూకుడు పెంచుతున్నారు. ఒక వైకాపా నేత హ‌త్య కేసులో చిక్కుకుని.. ఇటీవ‌లే బెయిల్ మీద బ‌య‌టికి వ‌చ్చిన తెదేపా నేత కొల్లు ర‌వీంద్ర‌ను బుధ‌వారం లోకేష్ ప‌రామ‌ర్శించారు. ఆయ‌న వెంట దేవినేని ఉమా స‌హా ప‌లువురు తెదేపా అగ్ర నేతలు ఉన్నారు.

ఈ సంద‌ర్భంగా అధికార పార్టీ నేత‌ల్నుద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లే చేశారు నారా లోకేష్‌. వైకాపా నాయ‌కుల అరాచ‌కాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయ‌న్న లోకేష్‌.. కేవలం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, జగన్ రెడ్డి గారి అసమర్ధ పాలనని ఎండగడుతున్నార‌నే అక్కసుతోనే కొల్లు ర‌వీంద్ర‌పై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఇళ్ల స్థ‌లాల సేక‌ర‌ణలో జ‌రిగిన అవినీతి మీద విచార‌ణ జ‌రిపిస్తామ‌ని.. అప్పుడు 40 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని లోకేష్ అన్నారు. టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల మీద పెట్టిన త‌ప్పుడు కేసుల‌ను మ‌రిచిపోయేది లేద‌ని.. అన్నింటికీ తాము సిద్ధంగా ఉన్నామ‌ని.. అడ్డ‌దారులు తొక్కుతున్న వైకాపా నాయ‌కుల‌కు వ‌డ్డీతో స‌హా అన్నీ చెల్లించి తీరుతామ‌ని లోకేష్ హెచ్చ‌రించ‌డం విశేషం.