జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించింది. ఇప్పటి వరకు ఆయన ఎక్కడ పర్యటించినా.. రాష్ట్ర పోలీసులు లేదా.. సొంత బౌన్సర్లు మాత్రమే ఆయనకు భద్రత కల్పిస్తున్నారు. అయితే.. గత ఏడాది విశాఖ, విజయవాడలో పర్యటించినప్పుడు పవన్ వ్యవహారంపై ప్రభుత్వం స్పందించలేదు. ఆయనకు భద్రత కల్పించే విషయంలోనూ తాత్సారం చేసింది. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు.. ఆయనను పరామర్శించాలని భావించిన పవన్ వస్తున్న సమయంలో అడ్డుకున్నారు.
దీంతో పవన్ రోడ్డుపై భైటాయించే ప్రయత్నం చేశారు. అయితే.. ఆయనకు భద్రత కల్పించకుండా.. పోలీసులు చోద్యం చూశారు. ఇది అప్పట్లో చర్చనీయాంశం అయింది. ఇక, రాజమండ్రిలోనూ పవన్‌కు పోలీసులు భద్రత కల్పించలేదు. ఈ వ్యవహారం కూడా రాజకీయంగా చర్చకు వచ్చింది. దీంతో అప్పటి నుంచి పవన్ తన భధ్రతను తానే చూసుకుంటున్నారు. బౌన్సర్లను తెచ్చుకుంటున్నారు. అయితే.. ఇటీవల ఆయన ఢిల్లీ వెళ్లిన తర్వాత.. పరిస్థితిలో మార్పు కనిపించింది. పవన్‌కు భద్రగా కేంద్ర బలగాలను నియమించారు.
1+1 భద్రతతో కేంద్ర సీఆర్ పీఎఫ్ భద్రతను కల్పించినట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే.. దీనిపై పవన్ కానీ, జనసేన కానీ.. స్పందించలేదు. తాజాగా విశాఖపట్నం వచ్చిన పవన్ వెంట ఇద్దరు సీఆర్ పీఎఫ్ సిబ్బంది భద్రతగా ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లినా వారు వెంటే ఉన్నారు. ఇక, రాష్ట్ర పోలీసులు కూడా పవన్‌కు భద్రత పెంచారు. మరి కేంద్రమే చెప్పిందో.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమో తెలియదు కానీ.. సీఐ స్థాయి పోలీసులు.. పవన్‌కు భద్రతగా నిలిచారు. ప్రస్తుతం పవన్‌కు సీఆర్ పీఎఫ్ భద్రత వ్యవహారం తెరమీదికి వచ్చింది.