వైసీపీ రాజకీయ వ్యూహకర్తల బృందం `ఐప్యాక్`తో సీఎం జగన్ తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ పరిణామం వైసీపీలో నేతల మధ్య అలజడికి దారితీసింది. ఇప్పటికే చాలా మంది నాయకులను ఐప్యాక్ సర్వేల ఆధారంగా పక్కన పెట్టడం.. బదిలీ చేయడం చేసిన నేపథ్యంలో మిగిలిన స్థానాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని.. నాయకులు హడలి పోతున్నారు. తాజాగా ఐప్యాక్ బృందంతో భేటీ అయిన సీఎం జగన్.. వచ్చే ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది.
ఇప్పటికి సుమారు 70 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే. ఇక, మిగిలినస్థానాల్లో పరిస్థితి ఎలా ఉందనేది వారితో చర్చించారని తెలిసింది. అదేవిధంగా వైసీపీ బలంగా ఉన్న నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితిని కూడా ఆరాతీసినట్టు తెలిసింది. ఇటీవల ఐప్యాక్ బృందం ఈ నాలుగు జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లో వైసీపీకి ఉన్న పాజిటివిటీ.. అదేసమయంలో ప్రతిపక్షాలకు ఉన్న పాజిటివిటీలను కూడా ఈ బృందం నివేదిక రూపంలో రెడీ చేసింది. దీనిని సీఎం జగన్‌కు అందించినట్టు తెలిసింది.
ఈ క్రమంలో ప్రాంతాలు, నియోజకవర్గాలు, పార్లమెంటు స్ధానాల వారీగా పార్టీ పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. వైసీపీకి ఏయే జిల్లాల్లో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, ప్రతిపక్షాలకు ఏయే జిల్లాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రజలను ఆకట్టుకోడానికి మ్యానిఫెస్టోలో ఏయే కార్యక్రమాలు చేర్చాలనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే మ్యానిఫెస్టోపై పార్టీ సీనియర్లతో జగన్ కసరత్తు చేశారు. ముఖ్యంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వంటి సీనియర్లు దీనిని చూస్తున్నారు.
ఇక, ఇప్పుడు తాజాగా ఐప్యాక్ బృందంతోనూ మ్యానిఫెస్టోపై సీఎం జగన్ చర్చించారు. గతంలో ఇచ్చిన దానికి భిన్నమైన పథకాలుఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇదిలావుంటే.. సీఎం జగన్ ఐప్యాక్ బృందంతో చర్చలు జరుపుతున్న వ్యవహారం పార్టీలో చర్చనీయాంశం అయింది. ఈ బృందం ఎలాంటి నివేదిక ఇస్తుందో.. తమలో ఎంతమందిని పక్కన పెడతారో.. అనే విషయంపై నాయకులు తల్లడిల్లుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.