ఉమ్మడి గుంటూరు జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం మంగళగిరి. ఇక్కడ నుంచి టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఐదు వేల ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ.. పడిన చోట నుంచే పైకి లేవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆయన పట్టుదలగా ఇక్కడ పని చేసుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కూడా పార్టీ తరఫున నిర్వహిస్తున్నారు. దీంతో మంగళగిరిలో నారా లోకేష్ ఓడిపోయినా..ఆయన హవా మాత్రం చెక్కు చెదరలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ అలెర్ట్ అయింది. వచ్చే ఎన్నికల్లో కూడా నారా లోకేష్‌ను ఓడించి తీరుతామని చెబుతున్న వైసీపీ తాజా పరిణామాలతో మంగళగిరిపై ప్రత్యేకంగా కాన్సంట్రేషన్ పెంచేసింది.
మంగళగిరిలో గత రెండు సార్లు వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే.. ఆళ్ల ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పారు. దీంతో మంగళగిరిలో ‘బీసీ కార్డు’ ప్రయోగానికి వైసీపీ సిద్ధమైంది. ఈ విషయం ముందుగానే తెలియడంతో ఆళ్ల వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ క్రమంలో చేనేత వర్గీయుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో.. అదే వర్గానికి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే గంజి చిరంజీవిని ఇన్‌చార్జ్‌గా ప్రకటించారు. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని అందరూ భావించారు.
మారిన సమీకరణలు..
ముందుగా చిరంజీవికి టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ.. నారా లోకేష్ వ్యూహాలను పసిగట్టిన వైసీపీ..ఇక్కడి పరిస్థితిని అంచనా వేసేందుకు పార్టీ సీనియర్ నేత, ఎంపీ వి. విజయసాయిరెడ్డిని తాజాగా రంగంలోకి దించింది. ఆయన వచ్చి.. నియోజకవర్గం నేతలతో భేటీ అయ్యారు. తాజాగా నారా లోకేష్ దూకుడు, వైసీపీ ప్రచారం వంటివాటిని ఆయన చర్చించినట్టు తెలిసింది. ఈ క్రమంలో నియోజవర్గంలో అభ్యర్తిని వారంలో ఖరారు చేస్తామని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.
నియోజకవర్గంలో పర్యటించిన సాయిరెడ్డితో గంజి చిరంజీవితో పాటు టికెట్ ఆశిస్తున్న మరో నేత కాండ్రు కమల కూడా ఉన్నారు. ఇద్దరిలో ఒకరిని ఖరారు చేస్తారా లేకపోతే.. లోకేష్ కు గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యంతో ఎవరినైనా హఠాత్తుగా రంగంలోకి తెస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏదేమైనా.. నారా లోకేష్ ప్రజలకు చేరువ కావడం.. క్షేత్రస్థాయిలో సొంత నిధులు ఖర్చు చేసి.. అందరినీ ఆకట్టుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీకి దడపుట్టిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తుండడం గమనార్హం.