ఆర్. కృష్ణయ్య.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. బీసీ సామాజిక వర్గాల ఆత్మగౌరవం అంటూ.. నినదించే గళం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. గతంలో టీడీపీ, తర్వాత వైసీపీలో నూ ఆయన చక్రం తిప్పారు. ప్రస్తుతం వైసీపీ తరఫున ఆయన రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. బీసీల కోసం .. జీవితాన్ని ధార పోశారని చెబుతారు. ఈ నేపథ్యంలో బీసీలను మరింతగా వైసీపీ వైపు మళ్లించుకునేందుకు సీఎం జగన్ ఆయనను ఏరికోరి రాజ్యసభకు పంపించారు.
అయితే.. ఇప్పుడు కీలకమైన ఎన్నికల సమయంలో ఆర్. కృష్ణయ్య అడ్రస్ ఎక్కడా కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఒకవైపు .. కీలకమైన బీసీ నాయకుడిగా.. ఏపీ కృష్ణయ్యగా పేరు తెచ్చుకున్న జంగా కృష్ణమూర్తి.. వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు న్యాయం అనేది వైసీపీలో నేతి బీరకాయలో నెయ్యి చందమేనని అన్నారు. అంతేకాదు.. సీఎం జగన్ మనసులో కూడా.. బీసీలకు స్తానం లేదని.. ఇక, కార్యాలయాల్లో ఎక్కడ ఉంటుందని.. పదవులు ఎందుకు ఇస్తారని కూడా వ్యాఖ్యానించారు.
ఇలాంటి సమయంలో జోక్యం చేసుకుని జంగాకు కౌంటర్ ఇస్తారని ఆర్. కృష్ణయ్యవైపు వైసీపీ నాయకులు ఆశగా ఎదురు చూశారు. కానీ, ఆయన మాత్రం పన్నెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఉలకలేదు.. పలకలేదు. పైగా తనకు తెలియనట్టే వ్యవహరించారు. దీనిని బట్టి ఆర్. కృష్ణయ్య వచ్చే ఎన్నికలకు దూరంగా ఉంటారా? లేక.. సీఎం జగన్ నుంచి ఆయనకు ఎలాంటి సందేశాలు వెళ్లలేదా? ఆయన చెబితే తప్ప స్పందించరా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ లేక పోవడం గమనార్హం.
పైగా బీసీల ఓటు బ్యాంకు కూడా కీలకంగా మారింది. రెడ్డి/కమ్మ వర్గాన్ని కూడా పక్కన పెట్టి… నరసరావు పేట వంటి చోట బీసీలకు జగన్ ప్రాధాన్యం పెంచారు. దీనిని ప్రజలలోకి తీసుకువెళ్లాల్సి ఉంది. అది కూడా బలమైన ఆర్. కృష్ణయ్య వంటివారితోనే సాధ్యమనే వాదన కూడా వినిపిస్తోంది. కానీ, ఆయన మాత్రం ఢిల్లీకే పరిమితమైనట్టు తెలుస్తోంది. పోనీ.. అక్కడైనా రాజ్యసభలో గళం వినిపిస్తున్నారా? అంటే.. అది కూడా లేదు. మరి జగన్ ఇచ్చిన పదవిని అనుభవించడానికే ఆయన పరిమితం అవుతారా? లేక పార్టీకి రుణం తీర్చుకుంటారా? అనేది చూడాలి.