వైసీపీకి ఇది పెద్ద దెబ్బే కదా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక పద్ధతి ప్రకారం తమ పార్టీకి అనుకూలమైన వ్యక్తులను గ్రామ వాలంటీర్లుగా నియమించుకుని గ్రామీణ స్థాయిలో అన్ని వ్యవహారాలనూ అదుపులోకి తెచ్చుకుంది. పింఛను డబ్బులు ఇవ్వాలన్నా వాళ్లే. ఒక సర్టిఫికెట్ తెచ్చుకోవాలన్నా వాళ్లే. ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన విషయమైనా వాళ్ల చేతుల మీదుగానే జరగాలి. వాలంటీర్లుగా ఉన్న వాళ్లందరూ వైసీపీ వాళ్లే అని జగన్, విజయసాయిరెడ్డి లాంటి అగ్ర నేతలే స్వయంగా ప్రకటనలు చేయడం తెలిసిన సంగతే.

సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు లాంటి కింది స్థాయి నేతలను మించి వైసీపీకి గ్రామ స్థాయిలో వాలంటీర్లే పెద్ద బలంగా మారిపోయారన్నది స్పష్టం. జనాల డేటా అంతా తమ దగ్గర పెట్టుకుని గ్రామ స్థాయి రాజకీయాలను శాసించే స్థాయికి వాలంటీర్లు వెళ్లిపోయారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కూడా.

వాలంటీర్లు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని.. ఎన్నికల ప్రక్రియలో ఏ రకంగా భాగమైనా వాళ్ల ప్రభావం చాలా ఉంటుందని.. అధికార పార్టీని గెలిపించడానికి చేయాల్సిందల్లా చేస్తారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో.. కోర్టు నుంచి ఒక కీలక నిర్ణయం వెలువరించింది ఎన్నికల సంఘం. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను ఎన్నికల విధుల్లో ఉపయోగించుకునే విషయమై ఈసీ స్పష్టత ఇచ్చింది. వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని.. సచివాలయ సిబ్బందికి కేవలం ఇంకు పూసే పని మాత్రమే అప్పగించాలని స్పష్టం చేసింది.

ప్రతి పోలింగ్ బూత్‌లో ఒకరు మాత్రమే ఉండాలని.. గతంలో బూత్ లెవెల్ ఆఫీసర్‌గా పని చేసిన వారిని విధుల్లోకి తీసుకోవద్దని పేర్కొంది. ఈ మేరకు సీఈసీ ఇచ్చిన ఆదేశాలను సీఈవో మీనా జిల్లా కలెక్టర్లకు పంపారు. ఎన్నికల్లో వాలంటీర్ల సేవలు ఉపయోగించుకుని ఓటర్లను ప్రభావితం చేసే ఆలోచనతో ఉన్న వైసీపీకి ఇది గట్టి ఎదురు దెబ్బే అని ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.