కేసీయార్లో ఫ్రస్ట్రేషన్ బయటపడిందా ?

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, తన హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలు బయటకు వస్తున్నాయన్న ఫ్రస్ట్రేషన్ కేసీయార్ లో పేరుకుపోయినట్లుంది. అందుకనే నల్గొండలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రభుత్వాన్ని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలను పట్టుకుని అరేయ్..ఓరేయ్..ఏ పీకుతారు అనే పదాలు వాడారు. పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీయార్ నుండి ఇలాంటి భాషను జనాలు ఆశించలేదు. మేడిగడ్డకు పోయి ఏమి పీకుతారంటు రేవంత్ రెడ్డి అండ్ కో ను కేసీయార్ నిలదీయటమే ఆశ్చర్యంగా ఉంది.

కేసీయార్ హయాంలో మేడిగడ్డ బ్యారేజిలో జరిగిన అవినీతి, నాసిరకం నిర్మాణాలను అందరికీ చూపించేందుకే రేవంత్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలందరినీ బ్యారేజికి తీసుకెళ్ళారు. కేసీయార్ హయాంలో ఎవరినీ బ్యారేజి చుట్టుపక్కలకు కూడా అనుమితంచలేదు. అలాంటిది ఇపుడు స్వయంగా రేవంతే అందరినీ వెంటపెట్టుకుని పోవటాన్ని కేసీయార్ తట్టుకోలేకపోతున్నారు. లేకపోతే బ్యారేజిలోని అన్ని పిల్లర్లలో ఒకటి, రెండు కుంగిపోతే ఏమవుతుందని కేసీయార్ ప్రశ్నించటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు బ్యారేజి పిల్లర్లు ఎందుకు కుంగాలని జనాలు నిలదీస్తున్నారు.

ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజి కట్టింది ప్రజాధానంతోనే అన్న విషయం కేసీయార్ మరచిపోయినట్లున్నారు. ప్రజాధనంతో కట్టిన బ్యారేజి ఏడు పిల్లర్లు కుంగిపోతే ఇక నిర్మాణం గట్టిగా ఉంటుందని ఎవరైనా ఎలాగ అనుకుంటారు ? రేపు నాలుగురోజులు భారీ వర్షాలు కురిసినపుడు నీళ్ళు వదిలేస్తే ఆ బరువుకు మరిన్ని పిల్లర్లు కుంగిపోయి డ్యామే దెబ్బతినేస్తే బాధ్యత ఎవరిది ? నదులపై అవగాహన లేదని తనను అడిగితే అన్నీ వివరిస్తానని బహిరంగసభలో కేసీయార్ చెప్పిన కేసీయార్ మరి అసెంబ్లీకి ఎందుకు హాజరుకాలేదు ?

బహిరంగ సభలో చెప్పిన విషయాలనే అసెంబ్లీలో చెప్పవచ్చు కదా ? అసెంబ్లీకి హాజరుకావడం ఇష్టంలేని కేసీయార్ బహిరంగసభలో మాత్రం ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఒకవైపు తనను అసెంబ్లీకి రావాలని రేవంత్ పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా కేసీయార్ పట్టించుకోవటంలేదు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక బీఆర్ఎస్ వాళ్ళు కూడా మేడిగడ్డకు వెళతామని కేసీయార్ చెప్పారు. వెళ్ళి ఏమిచేస్తారు ? తాను నిర్మించిన నాసిరకం నిర్మాణాన్ని చూస్తారా ? లేకపోతే దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని వితండ వాదం మొదలుపెడతారా ? మొత్తానికి కేసీయార్లో ఫ్రస్ట్రేషన్ బహిరంగసభలో బయటపడిందన్నది వాస్తవం.