జంపింగుల కంటే.. ఉన్నోళ్ల‌తోనే బాబుకు మంట‌!

Chandrababu

టీడీపీ అధినేత‌, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ చంద్ర‌బాబుకు ప్ర‌స్తుత రాజ‌కీయాలు క‌లిసి రావ‌డం లేదా? ఆయ‌న అనుకుంటున్న‌ది ఒక‌టి, పార్టీలో జ‌రుగుతున్న‌ది మ‌రొక‌టి అనేలా పాలిటిక్స్ న‌డుస్తున్నాయా?

క్షేత్ర‌స్థాయిలో ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక అజెండాతో ముందుకు సాగుతున్నా.. వ్య‌క్తిగ‌తంగా ఆయ‌న ఇమేజ్‌ను పెంచుకోలేక పోవ‌డానికి కార‌ణాలు ఏంటి? పోనీ.. సంస్థాగ‌తంగా పార్టీకైనా చంద్ర‌బాబు వ్యూహాలు మేళ్లు చేకూర్చ‌లేక‌పోవ‌డానికి రీజ‌నేంటి? అనే అంశాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. చంద్ర‌బాబు చుట్టూ ఉన్న‌వారేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత చంద్ర‌బాబును వ‌దిలేసి పార్టీ మారిపోయిన త‌మ్ముళ్లు చాలా మంది ఉన్నారు. వీరిలో కాపు, క‌మ్మ‌, బీసీ, ఓసీ వ‌ర్గాల‌కు చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీలు, ఇత‌ర నాయ‌కుల జాబితా పెద్ద‌గానే ఉంది. వీరంతా కూడా చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

చిత్ర‌మేంటంటే.. పార్టీలో వీరికి చంద్ర‌బాబు న‌మ్మిన బంట్లుగా పేరు ఉండ‌డం. పైగా వీరికి, చంద్ర‌బాబుకు మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉండ‌డం. ఇలాంటివారు ఇప్పుడు పార్టీకి దూర‌మై.. చంద్ర‌బాబు టార్గెట్‌గా తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. దీంతో బాబుపై వ్య‌తిరేక‌త ఎన్నిక‌ల‌కు ముందు ఎలా ఉన్న‌దో ఇప్పుడూ అలాగే ఉంద‌ని టీడీపీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.

స‌రే.. పోయినోళ్లు పోయినా.. ఇప్పుడు పార్టీలో ఉన్న‌వారైనా.. చంద్ర‌బాబుకు క‌లిసి వ‌స్తున్నారా? ఆయ‌న చుట్టూ ఉన్న‌వారైనా ఆయ‌న‌కు ప్ల‌స్ అయ్యేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. లేద‌నే స‌మాధానం వ‌స్తోంది. పోయినోళ్ల కంటే కూడా ఉన్నోళ్ల‌తోనే బాబుకు త‌ల‌నొప్పులు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు.

పార్టీని వీడిపోయారు కాబ‌ట్టి ఆ నేత‌ల‌ను ఎలాగూ చంద్ర‌బాబున‌మ్మే ప‌రిస్థితి లేదు. వారు రాజ‌కీయ స‌హ‌జ‌ల‌క్ష‌ణ‌మైన‌.. విమ‌ర్శ‌లు చేయ‌డం ప‌రిపాటి. కానీ, బాబు చుట్టూ మూగిన వారు.. ఆయ‌న‌కు జైకొడుతున్న వారు కూడా లోపాయికారీగా మౌనం వ‌హించ‌డం.. మా బాబు మార‌డు. ఇంతే! అంటూ.. వ్యాఖ్య‌లు చేయ‌డం, చంద్ర‌బాబు పిలుపునిచ్చిన ఉద్య‌మాల‌కు దూరంగా ఉండ‌డం వంటివి పార్టీకే కాకుండా చంద్ర‌బాబు ఇమేజ్‌కు కూడా తీవ్ర న‌ష్టం వాటిల్లేలా చేస్తున్నాయ‌నేది బ్రేకింగ్ చ‌ర్చ‌.

బాబు చెంత‌నే ఉంటూ.. ఆయ‌న‌ను ప‌ట్టించుకోని వారు, ఎవ‌రి అజెండాను వారు అమ‌లు చేస్తున్న వారు ప్ర‌తి జిల్లాలోనూ ఉన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు త‌మ‌కు నిధులు ఇవ్వ‌లేద‌నో.. తాము చెప్పిన వారికి టికెట్లు ఇవ్వ‌లేద‌నో.. అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌నో.. పార్టీ కోసం ప‌నిచేసినా త‌మ‌ను చిన్న‌చూపు చూశార‌నో ఇలా.. కార‌‌ణాలు ఏవైనా కావొచ్చు.. చాలా మంది నాయ‌కుల్లో అసంతృప్తి మాత్రం ఇప్ప‌టికీ అలానే ఉంది.

దీంతో చంద్ర‌బాబుకు మైలేజీ పెర‌గ‌డం లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు. పోయిన‌వాళ్లు పోయినా.. ఉన్న‌వారినైనా త‌న ‌లైన్‌లోకి తెచ్చుకునేందుకు బాబు పెద్ద‌గా ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేదు. ఫ‌లితంగానే చంద్ర‌బాబుకు మైలేజీ పెర‌గ‌డం లేద‌ని అంటున్నారు. మ‌రి ఈ ప‌రిస్థితి ఎప్ప‌టికి మారుతుందో చూడాలి.