వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు చేయాల్సి రావడం ఖాయమైపోయింది. ఇండియా కూటమిని ఏర్పాటు చేసి కేంద్రంలోని నరేంద్ర మోడీని గద్దె దింపాలన్న ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌కు అడుగడుగునా సంకటం ఏర్పడిన విషయం తెలిసిందే. పొత్తులకు.. టికెట్ల కేటాయింపు ప్రధాన అవరోధంగా మారిన దరిమిలా.. ఒక్కొక్క పార్టీ కట్టుతప్పి.. పక్కకు జరిగిపోయాయి. మొత్తం 28 పార్టీల సమాహారంగా ఉన్న ఇండియా కూటమిలో కీలకమైన పెద్దపార్టీలు దాదాపు తప్పుకొన్నాయి.
బిహార్ అధికార పార్టీ జేడీయూ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పాగా వేసి ఆమ్ ఆద్మీపార్టీ, పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌లు.. కాంగ్రెస్‌కు హ్యాండిచ్చాయి. ఇక, చిన్నా చితకా పార్టీలు కూడా.. కొన్ని బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. వాటిని చేర్చుకునేందుకు తాము సిద్ధమేనని.. రాజకీయాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ ఉండదని.. ఎంత మంది వచ్చినా.. బీజేపీ ద్వారాలు తెరిచే ఉన్నాయని.. తాజాగా అమిత్ షా వ్యాఖ్యానించా రు. దీంతో ఆర్ ఎల్ డీ సహా మరో రెండు పార్టీలు బీజేపీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాయి.
ఇక, మరో కీలక ఘటన కాంగ్రెస్‌కు కంట్లో నలుసుగా మారింది. పంజాబ్ లో ఇండియా కూటమితో ఎలాంటి పొత్తు ఉండదని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. చండీగఢ్‌తో సహా మొత్తం 14 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టంచేశారు. ‘15 రోజుల్లోగా ఈ స్థానాల్లో ఆప్ అభ్యర్థులను ప్రకటిస్తుంది’ అని తెలిపారు.
మరోవైపు అస్సాంలో మొత్తం 14 లోక్‌సభ నియోజకవర్గాలకు గానూ 3 స్థానాలకు కూడా ఆయన రెండు రోజుల కిందటే ఆప్ తరఫున బరిలో నిలిచే అభ్యర్థులను ప్రకటించారు. దిబ్రుగఢ్ నుంచి మనోజ్ దానోవర్, గువాహటి, తేజ్‌పుర్ స్థానాల నుంచి భాబెన్ చౌదరి, రిషిరాజ్ కౌంటిన్యలు పోటీ చేస్తారని వెల్లడించింది. అయితే.. ఇక్కడ చిత్రం ఏంటంటే.. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ విజయం దక్కించు కుంది. అలాంటి సీట్లలోనూ అభ్యర్థులను ప్రకటించడం వెనుక.. పక్కాగా.. ఇండియా కూటమి నుంచి తాము బయటకు వస్తున్నామన్న సంకేతాలు పంపినట్టు అయింది. దీంతో ఇక కాంగ్రెస్ ఒంటరి పోరు చేయాల్సి రాకతప్పదని అంటున్నారు పరిశీలకులు. మరి ఏమేరకు మోడీని ఢీ కొంటారో చూడాలి.