తొందరలోనే బీజేపీ తరపున ఒక మీడియా అధిపతికి రాజ్యసభ ఎంపీ పదవి లభించబోతోందని సమాచారం. చాలామంది మీడియా అధినేతలు బీజేపీతో బాగా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ పద్దతి దక్షిణాదిలో తక్కువే కాని ఉత్తరాధిలో చాలా ఎక్కువ. మీడియా అధినేతల నుండి వివిధ మీడియాల్లో అత్యున్నత స్ధాయిలో పనిచేస్తున్న చాలామంది బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తుంటారు. ఇప్పటివరకు తెలుగురాష్ట్రాల్లో బీజేపీకి బాగా దగ్గరైన మీడియా అధిపతులు లేరనే చెప్పాలి. ఎందుకంటే తెలంగాణాను వదిలేస్తే ఏపీలో బీజేపీ ఉనికి నామమాత్రమే.
మీడియాలో రెండురాష్ట్రాల్లోను తమకు వస్తున్న ప్రచారాన్ని బాగా పెంచుకోవాలని కమలనాదులు అనుకున్నారట. అందుకనే ఒక మీడియా అధినేతను దగ్గరకు తీసుకోవటం ద్వారా ఆ లోటును భర్తీ చేసుకోవాలని అగ్రనేతలు డిసైడ్ అయినట్లు సమాచారం. ఒక టీవీ ఛానల్ అధినేతను పార్టీలో చేర్చుకుని రాజ్యసభ ఎంపీని చేయటానికి అగ్రనాయకత్వం డిసైడ్ అయ్యిందని టాక్ వినబడుతోంది. ఈమధ్య హైదరాబాద్ కు వచ్చిన నరేంద్రమోడీ సదరు మీడియా అధినేత ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారట.
అలాగే మీడియా అధినేత కూడా ఢిల్లీకి వెళ్ళినపుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో అన్నీ విషయాలు మాట్లాడుకుని వచ్చారని తెలిసింది. పరిస్ధితులు అన్నీ అనుకూలిస్తే రాబోయే ఏప్రిల్ లోనే ఉత్తరప్రదేశ్ కోటాలో పార్టీ తరపున ఈ మీడియా అధిపతి నామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు సమాచారం. ఇది గనుక జరిగితే ఒక పార్టీలో డైరెక్టుగా చేరిపోయి రాజ్యసభ ఎంపీ అయినా మొదటి అధినేతగా సదరు మీడియా అధిపతి రికార్డు సృష్టిస్తారేమో.
ఇప్పటివరకు ఎంఐఎం తరపున శాసనమండలికి నామినేట్ అయిన మీడియా అధినేతలున్నారు, సీనియర్ జర్నలిస్టులున్నారు. ఈ వ్యవహారమంతా ముస్లిం మైనారిటీల వరకే పరిమితమైంది. ఎంఐఎం అధినేతలు ఇతర వర్గాలను దగ్గరకు చేరదీయరు, ఇతరులకు పదవులను ఇవ్వరు. కాబట్టి ఎంఐఎం వ్యవహారాలను ఎవరు పట్టించుకోరు. తన బలం సరిపోదుకాబట్టి తమ మిత్రపక్షాల నుండి మద్దతు తీసుకుని తమకిష్టమైన వాళ్ళనే కౌన్సిల్ కు పంపుతుంటారు. కానీ ఇపుడు మైన్ స్ట్రీమ్ మీడియా అధినేతలు ఒక పార్టీ తరపున అత్యున్నత చట్టసభకు వెళ్ళే అవకాశం రావటం మాత్రం ఇదే మొదటిసారని అనుకుంటున్నారు.