ఏపీ ఎన్నికల ప్రచారంలో కొత్త ముఖాలు

ఏపీలో ఎన్నిక‌లకు స‌మ‌యం దూసుకువస్తున్న ద‌రిమిలా.. కీల‌క‌మైన పార్టీలు .. ఇప్ప‌టికే ప్ర‌చారం ప్రారంబించాయి. వైసీపీ సిద్ధం పేరుతో పార్టీ ప్ర‌చారాన్ని భీమిలిలో ప్రారంభించింది. అక్క‌డే సీఎం జ‌గ‌న్ పార్టీ ప్ర‌చారాన్ని శంఖారావంతో ప్రారంభించారు. ఇక‌, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ ద‌ఫా ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని రా..క‌ద‌లిరా! నినాదంతో ప్రారంభించారు. దాదాపు ఎన్నిక‌ల‌కు దీనినే కొన‌సాగించే అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ‌.. జ‌న‌సేన ఇంకేదైనా సూచిస్తే.. మార్చ‌నున్నారు.

ఇక‌, జ‌న‌సేన వారాహి యాత్ర పేరుతోనే ఎన్నికల‌ ప్ర‌చారాన్ని ప్రారంభించ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 4 నుంచి ఈ ప్ర‌చారం ప్రారంభం కానుంది. ఈ మూడు కీల‌క పార్టీలూ ప్ర‌చారాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఇక‌, కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి కుమార్తెకు పార్టీ ప‌గ్గాలు ఇచ్చింది. ఆమె ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేసింది. అయితే.. ప్ర‌స్తుతం ఏ పేరుతో మ‌రింత దూకుడుగా వెళ్లాలా? అనేదానిపై ఆ పార్టీ సీనియ‌ర్లు దృష్టి పెట్టారు. మొత్తానికి ఏదో ఒక పేరును నిర్ఱ‌యించ‌నున్నారు.

ఇక‌, చిన్నా చిత‌కా పార్టీలు సాధార‌ణ ప్ర‌చారంతోనే స‌రిపెట్ట‌నున్నాయి. ఇదిలావుంటే.. అధికారం కోసం.. కీల‌క పోరును సాగించ‌నున్న వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్ పార్టీల‌కు పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ప్ర‌చార క‌ర్త‌లు బ‌రిలో దిగ‌నున్నారు.ఇప్ప‌టికే ష‌ర్మిల‌కు అండ‌గా.. తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రు ఫైర్ బ్రాండ్లు ప్ర‌క‌ట‌న చేశారు. వీరిలో ఒక‌రు కొండా సురేఖ‌. ఈమె ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ష‌ర్మిలకు అండ‌గా ప్రచారంలోకి దిగుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

ఇక‌, ఉమ్మ‌డి ఖ‌మ్మం మాజీ ఎంపీ రేణుకా చౌద‌రి కూడా ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. అయితే.. పార్టీ అధిష్టానం ఓకే అంటే.. ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. సీఎం రేవంత్ కూడా.. ఇదే మాట చెప్పారు. పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం కోరుకుంటే. తాను కూడా ఏపీలో ప‌ర్య‌టించి ప్ర‌చారం చేస్తాన‌న్నారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. పొరుగు రాష్ట్రం నుంచి వ‌చ్చే వారు లేకున్నా… విదేశాల్లో ఉంటున్న ప్ర‌వాస తెలుగు దేశం పార్టీ సీనియ‌ర్లు ప్రచారానికి రానున్నారు.

అదేవిధంగా రాజ‌ధాని రైతులు కూడా జిల్లాల వారీగా ఎంచుకుని ప్ర‌చారం చేయ‌నున్న‌ట్టు తాజాగా తీర్మానం చేశారు. అయితే.. ఇది టీడీపీకి నేరుగా కాకుండా వైసీపీకి వ్య‌తిరేకంగా సాగ‌నుంది. మ‌రోవైపు.. జ‌న‌సేన‌కు ఇండ‌స్ట్రీ నుంచి కొంత మ‌ద్ద‌తు ల‌భించే అవ‌కాశం ఉంది. ప్ర‌ధాన పార్టీ వైసీపీకి పెద్ద‌గా ఎవ‌రూ క‌నిపించ‌డం లేదు. ఈ పార్టీకి ప్ర‌వాసంలో అయినా.. ఇత‌ర రాష్ట్రాల నుంచైనా వ‌చ్చి.. ప్ర‌చారం చేసేందుకు ఎవ‌రూ లేర‌నే తెలుస్తోంది. కేవ‌లం జ‌గ‌న్‌.. మాత్రమే ఐకాన్‌గా ప్ర‌చారాన్ని ముందుకు తీసుకువెళ్ల‌నున్నార‌ని స‌మాచారం.