తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వెళ్లిన యువ నాయకుడు… దేవినేని అవినాష్ అనతి కాలంలోనే సీఎం జగన్‌కు సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారని లోకల్ టాక్. విజయవాడ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త దేవినేని అవినాష్ ఈ సారి ఎన్నికల్లో విజయం దక్కించుకోవడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. ఆయన ఈ సారి విజయంతో అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారన్న టాక్ బెజవాడ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. బెజవాడ రాజకీయాల్లో కాకలు తీరిన దివంగత నేత దేవినేని నెహ్రూ రాజకీయ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఇప్పటికే రెండుసార్లు ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన ఆయన గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు.
ఇక, 2019 ఎన్నికల నాటికి టీడీపీలో ఉన్న దేవినేని.. అప్పటి చంద్రబాబు వ్యూహంలో భాగంగా గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అవినాష్ గుడివాడకు నాన్‌లోకల్ అయినా, సమీకరణలు అనుకూలంగా లేవని తెలిసినా కూడా ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాలు.. సమీకరణల నేపథ్యంలో టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేశారు. దీనికి తోడు సీఎం జగన్ ఆశీస్సులు కూడా పొందారు. వెంటనే ఆయనను ఆయన కోరుకున్నట్టుగానే తూర్పు నియోజకవర్గానికి పంపించి వెంటనే సమన్వయకర్తగా కూడా ప్రకటించారు.
దీంతో దేవినేని వచ్చే ఎన్నికల్లో ఈ టికెట్‌పైనే పోటీ చేయనున్నారు. ఇక, యాక్టివ్ గా ఉంటూ దేవినేని పాలపుర్ అయ్యారు. తాను ఎమ్మెల్యే కాకపోయినా.. ప్రభుత్వంతో ఆయనకు ఉన్న వెయిట్ వల్ల నియోజకవర్గంలో కొన్ని అభివృద్ది పనులు చేయించి పలువురి ద్రుష్టి ఆకర్షించారు. ముఖ్యంగా మొగల్రాజపురం, గుణదల ప్రాంతాల్లోని కొండ ప్రాంతాల వాసుల చిరకాల కోరికైన ఇంటి పట్టాలను అందించారు. ఇది మనోడికి మంచి మైలేజ్ తెచ్చి పెట్టింది.
అదేవిధంగా ఆటోనగర్ పరిధిలో కీలకమైన.. కానూరు, రామవరప్పాడు.. మధ్య కొత్తగా రహదారిని ఎటువంటి వివాదాలు లేకుండా రైతులను కూడా సానుకూలంగా ఒప్పించి.. వారికి పరిహారం అందించారు. దీంతో ఆయా ప్రాంతాల వాసులకు .. సుమారు 6 కిలోమీటర్ల ప్రయాణ భారం తగ్గించారు. చిన్నవాడు కావడంతో పార్టీలో అందరినీ కలుపుకొని పోవడం.. ముక్యంగా యువతకు పెద్ద పీట వేయడం ద్వారా.. సత్తా చాటుతున్నారు.
ఇక, కమ్మ సామాజికవర్గంలోను.. తన తండ్రి మాజీ మంత్రి దేవినేని నెహ్రూ సన్నిహితులు, మిత్రుల ఆశీర్వాదం సంపూర్ణంగా ఉంది. ఇటు ఎంపీ కేశినేని నాని వైసీపీలోకి వచ్చి వచ్చే ఎన్నికల్లో బెజవాడ వైసీపీ ఎంపీగా పోటీ చేయడంతో కాంబినేషన్ కూడా బాగా సెట్ అయ్యిందంటున్నారు. ఇవన్నీ కలిసొస్తే దేవినేని అవినాష్ కు గెలుపు దక్కవచ్చు. కానీ ఎన్నికల గాలి లో ఒక్కోసారి కొన్ని తారుమారయ్యే అవకాశాలు లేకపోలేదు. కానీ నియోజకవర్గం పరంగా చూస్తే మాత్రం ప్లస్ లో ఉన్నారు.