తాము చేపట్టాలని భావించిన కీలక ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడం లేదని కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. విభజన చట్టంలోని కీలకమైన హామీగా ఉన్న విశాఖ రైలు జోన్ ప్రాజెక్టు విషయంపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీకుమార్ వైష్ణవ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. విశాఖ రైలు జోన్ ప్రాజెక్టుకు 53 ఎకరాల భూమి అవసరమని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని 2019 నుంచి చెబుతున్నా..ఏపీ ప్రభుత్వం పట్టనట్టే వ్యవహరిస్తోందన్నారు. అందుకే ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదన్నారు.
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు రెడీగా ఉందన్న అశ్వినీ కుమార్.. భూమి తమకు అప్పగిస్తే.. పనులు తక్షణమే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించాలన్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం తమకు సహకరిస్తోందని మంత్రి కితాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణలో 100 శాతం రైల్వే లైన్లను విద్యుదీకరించినట్టు తెలిపారు. అదేవిధంగా ఫ్లై ఓటర్లు, అండర్ పాస్ బ్రిడ్జిలను కూడా నిర్మించినట్టు చెప్పారు. ఈ తరహాలో రాష్ట్రాలు సహకరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఇక, ప్రస్తుత మధ్యంతర బడ్జెట్‌పై మంత్రి మాట్లాడుతూ.. ఒక్క ఏపీకే 9 వేల కోట్ల రూపాయలకు పైగా.. ప్రభుత్వం రైల్వేలకు నిధులు కేటాయించిందని తెలిపారు.గత యూపీఏ పాలనలో 2009 నుంచి 2014 వరకు 900 కోట్లరూపాయలు కేటాయిస్తే.. తమ ప్రభుత్వం మాత్రం వేలాది కోట్లరూపాయలను కేటాయిస్తూ.. దేశవ్యాప్తంగా రైళ్లను ఆధునీకరిస్తోందని తెలిపారు. త్వరలోనే నమో వందే భారత్ రైళ్లను దేశవ్యాప్తంగా ప్రవేశ పెట్టనున్నట్టు వివరించారు. “అభివృద్ధి అనేది మా చేతుల్లోనే లేదు.. రాష్ట్రాలు కూడా సమకరించాలి” అని పరోక్షంగా ఏపీని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates