కాంగ్రెస్ టికెట్ పై బీఆర్ఎస్ ఎంపీ పోటి ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణాలో బీఆర్ఎస్ ఎంపీ కాంగ్రెస్ నుండి పోటీచేయటానికి రంగం రెడీ అయ్యిందని సమాచారం. ఇపుడు బీఆర్ఎస్ కు ఎనిమిది మంది ఎంపీలున్నారు. తొమ్మిది మంది గెలిచినా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి దుబ్బాక నుండి ఎంఎల్ఏగా గెలవటంతో రాజీనామా చేశారు. దాంతో బీఆర్ఎస్ ఎంపీల బలం ఎనిమిదికి తగ్గింది. ఇక విషయానికి వస్తే తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి దింపాల్సిన అభ్యర్ధులపై కేసీయార్ కసరత్తు మొదలుపెట్టారు.

ఇపుడున్న ఎంపీలందరికీ టికెట్లు దాదాపు ఖాయమన్నట్లే పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఎంపీల్లో చాలామంది పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులే. అందుకనే వాళ్ళకి డబ్బుకు ఎలాంటి లోటులేదు. కాబట్టి వాళ్ళనే పోటీచేయిస్తే పార్టీమీద చాలావరకు ఆర్ధికభారం తగ్గిపోతుందని కేసీయార్ ఆలోచించారట. అయితే ఒక ఎంపీ మాత్రం బీఆర్ఎస్ తరపున పోటీచేయటానికి ఇష్టపడటంలేదని సమాచాం. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో తనకున్న సన్నిహితంతో మాట్లాడారట. పార్టీలోకి వస్తే మళ్ళీ టికెట్ ఇస్తామని గ్యారెంటీ వచ్చిందట.

ప్రస్తుత పరిస్ధితుల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేస్తే గెలిచేది కష్టమని అర్ధమవటంతో సదరు ఎంపీ కూడా తొందరలో కాంగ్రెస్ లో చేరి మళ్ళీ పోటీచేయాలని డిసైడ్ అయ్యారట. ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ ముఖ్యనేత అలర్టయ్యారు. అందుకనే సదరు ఎంపీ ఇంటికి ఇద్దరు కీలక నేతలను పంపారట. వాళ్ళిద్దరు ఎంపీ ఇంట్లో దాదాపు నాలుగు గంటలు కూర్చుని పార్టీమారద్దని నచ్చచెప్పే ప్రయత్నంచేశారట. పోయిన ఎన్నికల్లో ఖర్చుమొత్తం సదరు ఎంపీనే భరించుకున్నారట. అదే విషయాన్ని ఇద్దరు నేతలు ఇపుడు ప్రస్తావించారట.

పోయిన ఎన్నికల్లోలాగ ఖర్చు మొత్తం భరించుకోవాల్సిన అవసరం లేదని మొత్తం ఖర్చులో సగం పార్టీ భరిస్తుందనే బంపర్ ఆపర్ కూడా ఇచ్చారట. అయినా ఆ ఎంపీ పెద్దగా సానుకూలంగా స్పందించలేదని సమాచారం. ఇంతకీ ఆ ఎంపీ ఎవరు ? ఎంపీ ఇంటికి వెళ్ళి మాట్లాడిన ఇద్దరు కీలకనేతలు ఎవరనే విషయాలు ఒకటిరెండు రోజుల్లో వెలుగుచూసే అవకాశాలున్నాయి. మరి బయటపడే విషయాలు ఏమిటో చూడాలి.