గ‌ద్ద‌ర్‌కు నిలువెత్తు గౌర‌వం.. ట్యాంక్‌బండ్‌పై విగ్ర‌హం!

ప్ర‌జా గాయ‌కుడు, విప్ల‌వ‌మూర్తి గ‌ద్ద‌ర్‌కు నిలువెత్తు గౌర‌వం ల‌భించింది. ఆయ‌న నిలువెత్తు విగ్ర‌హాన్ని హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఎన్నిక‌ల‌కు ముందు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ప్రజాకవి గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా అని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ హామీని నిలెట్టుకోనున్నారు.

తాజాగా తెల్లాపూర్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ చేసిన తీర్మానానికి హైద‌రాబాద్ మెట్రోడెవ‌ల‌ప్ మెంట్ అధారిటీ ఓకే చెప్పింది. దీంతో ట్యాంక్‌బండ్ లేదా.. ప‌రిస‌ర ప్రాంతాల్లో విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసేందుకు అవ‌స‌రమైన భూమిని కేటాయించాల‌ని ప్ర‌భుత్వం రెవెన్యూ అదికారుల‌ను ఆదేశించింది. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌లో గానే ఈ ప్ర‌క్రియ పూర్తికానుంద‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే, తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ .. దీనికి ముందు కూడా.. గ‌ద్ద‌ర్‌.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ప‌రిష్కారం పోరాట చేశారు.

విప్ల‌వ పంథాను ఎంచుకుని కొన్నాళ్లు.. త‌ర్వాత‌.. సాధార‌ణ ఉద్య‌మ వాదిగా క‌డ‌దాకా పోరాటం చేశారు. త‌న దైన బాణీలో పాట‌లు క‌ట్టి గ‌జ్జెక‌ట్టి.. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో అభిమానం సంపాయించుకున్నాడు. గ‌త ఏడాది జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు.. ఆయ‌న కాంగ్రెస్ ప‌క్షాన నిలిచారు. త‌న కుమారుడు, లేదా కుమార్తెకు రాజ‌కీయంగా ప్రాదాన్యం కోసం ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్‌కు , రేవంత్‌కు కూడా చేరువ‌య్యారు. ఎన్నిక‌లకు ముందుగానే గ‌ద్దర్ మ‌ర‌ణించారు. అయితే.. ఆయ‌న‌కు మాట ఇచ్చిన‌ట్టుగానే.. రేవంత్ విగ్ర‌హ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.

బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీ కీల‌కంగా భావిస్తున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు ముందు జ‌రుగుతున్న గ‌ద్ద‌ర్ విగ్ర‌హం ఏర్పాటు.. కాంగ్రెస్‌కు ప్ల‌స్ అవుతుంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణ పోరాటంలో కీల‌క పాత్ర పోషించిన కోదండ‌రాంకు ఎమ్మెల్సీ ఇవ్వ‌డం.. అదేవిధంగా ఆనాటి త్యాగాల‌కు ప్రాధాన్యం ఇస్తూ.. అమ‌ర వీరుల కుటుంబాల‌కు ప్ర‌త్యేక సంక్షేమం అమ‌లు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్న నేప‌థ్యంలో ఇప్పుడు గ‌ద్ద‌ర్‌కు విగ్ర‌హం ఏర్పాటు ఎన్నిక‌ల్లో మేలు చేస్తుంద‌ని అంటున్నారు.