రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాల్సిన అభ్యర్థుల జాబితాను చంద్రబాబునాయుడు దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. అన్నీ నియోజకవర్గాల్లోను రకరకాల పద్ధతుల్లో పార్టీ సర్వే చేయిస్తోంది. ఇందులో ఐవీఆర్ఎస్ పద్దతితో పాటు పార్టీ తరపున ఒకసర్వే అలాగే చంద్రబాబు తరపున వ్యక్తిగత టీమ్ మరోటి కూడా సర్వే చేస్తోంది. ఇలా రకరకాల పద్ధతుల్లో సర్వేలు చేయించి అందులో మెజారిటీ ఆమోదయోగ్యం లభించిన నేతలకు టికెట్లు ఫైనల్ చేస్తున్నారట.
మొదటి జాబితాలో సుమారు 50 మందికి టికెట్లను ప్రకటించాలని చంద్రబాబు ఇప్పటికే డిసైడ్ అయ్యారట. ఇందులో సిట్టింగ్ ఎంఎల్ఏలు కూడా ఉండే అవకాశముంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎంఎల్ఏ గోరంట్ల బుచ్చయ్యచౌదరి పోటీపై బాగా అయోమయం పెరిగిపోతోంది. ఈ సీటును పొత్తులో జనసేనకు కేటాయించవచ్చనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. దానికి తగ్గట్లే జనసేన నేత కందుల దుర్గేష్ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. కాబట్టి గోరంట్లకు టికెట్ అనుమానంగా ఉంది.
ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఫిబ్రవరి 4 లేదా 5వ తేదీన మొదటి జాబితా ప్రకటించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. టీడీపీ మొదటి జాబితా ప్రకటన అంటే జనసేన తరపున కూడా మొదటిజాబితా ప్రకటన ఉంటుందనే అనుకుంటున్నారు. బయటకు ప్రకటించకపోయినా రెండు పార్టీలు పోటీచేయబోయే సీట్ల సంఖ్య, నియోజకవర్గాలు చంద్రబాబు, పవన్ కు తెలుసు. కాబట్టి టీడీపీ పోటీచేయబోయే నియోజకవర్గాలతో పాటు జనసేన పోటీచేయబోయే స్ధానాలపైన కూడా చంద్రబాబు సర్వేలు చేయించారట. ఈ సర్వేలు దాదాపు పూర్తియిపోయినట్లు పార్టీవర్గాల టాక్.
ఎలాగూ సర్వేలు పూర్తియిపోయింది కాబట్టి అభ్యర్ధులను విడతలవారీగా ప్రకటించేస్తే ప్రచారం చేసుకుంటారని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఎక్కడైనా సమస్యలు వస్తే సర్దుబాటు చేసుకునేందుకు కూడా తగిన సమయం ఉంటుందని అనుకున్నారట. ఇప్పటికే మండపేట, అరకు నియోజకవర్గాల్లో పోటీచేయబోయే అభ్యర్ధులను చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అభ్యర్ధుల ఎంపికలో చంద్రబాబు సామాజికవర్గాల సమీకరణలు, ఆర్ధిక పరిస్ధితులు, నేతల ట్రాక్ రికార్డు, పార్టీలో వాళ్ళకున్న మద్దతు లాంటి అనేక విషయాలను దృష్టిలో పెట్టుకుని సర్వేలు చేయిస్తున్నారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుని చేయించిన సర్వేల్లో అభ్యర్ధులుగా ఎవరుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates