వైసీపీ అధినేత జగన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. రాష్ట్రంలో కంటే కూడా ఉప్పుడు కేంద్రంలో ఆయనకు పెద్ద చిక్కు వచ్చింది. తరచుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సర్కారుకు గుడ్డిగా మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రపతి ఎన్నికల నుంచి ఉపరాష్ట్రపతి ఎన్నికల వరకు మద్దతు ఇచ్చారు. తన పార్టీలో ఎంతో మంది నాయకులు పదవుల కోసం వేచి చూస్తున్నా.. బీజేపీ కోరిందని రాజ్యసభ సీటును ఉత్తరాదికి చెందిన నత్వానీకి ఇచ్చారు.
ఇక, తమ పార్టీలోనే ‘రైతు’ పేరు ఉన్నప్పటికీ.. గతంలో ప్రధాని మోడీ తీసుకువచ్చిన వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు కూడా రాజ్యసభలో మద్దతు తెలిపి.. ఆ బిల్లు పాసయ్యేలా చేశారు. ఇక, ఎప్పటికప్పుడు.. కేంద్రంతోనూ ఆయన టచ్‌లోనే ఉన్నారు. ఇలాంటి కీలక సమయంలో ఇప్పుడు తనకు పెద్ద చిక్కే వచ్చిందని.. తాజాగా జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది తనకు కూడా ప్రతిష్టాత్మకమేనని ఆయన భావిస్తున్నారు.
గత 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. అప్పటి వరకు 151 మంది ఎమ్మెల్యేలతో విరాజిల్లిన వైసీపీ.. కేవలం 11 స్థానాలకు పడిపోయింది. దీనిపై అప్పట్లోనే జగన్ అనుమానాలు వ్యక్తం చేశారు. తన దగ్గర ఆధారాలు లేవంటూనే .. ఎన్నికల వ్యవస్థపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఏం జరిగిందో ఏమో.. అంటూ.. ఎన్నికల నిర్వహణను జగన్ తప్పుబట్టారు. ఆ తర్వాత.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు చేసినప్పుడు.. పరోక్షంగా ఆ విమర్శలను సమర్థిస్తూనే.. ఏపీ విషయం ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘంలోని ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానంపెట్టారు. ఆయనను ఆ పదవి నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు.. మూకుమ్మడిగా ఈ నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ నోటీసులపై జగన్ వైఖరి ఏంటి? అనేది ఇప్పుడు సందేహంగా మారింది.
నిజంగానే ఎన్నికలను తప్పుబడుతుంటే.. ఆయన ఈ అవిశ్వాసానికి మద్దతుగా పార్లమెంటులో తన ఎంపీల ద్వారా గళం వినిపించాలని.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. కానీ, మరోవైపు.. మోడీ సహా.. అధికార పక్షం ఈ అవిశ్వాసాన్ని నెగ్గేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జగన్ ఎలాంటి అడుగులు వేయాలన్నది ఆయనకు ప్రధాన చిక్కుగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates
