“వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేసింది చాలు. ఆయనను తిడితే మనం పుంజుకుంటామా? ప్రస్తుతం మీ వ్యాఖ్యలు.. వ్యక్తిగత విమర్శలుగా మారిపోయాయి. ప్రజల్లోకి వేరే కోణంలో వెళ్తున్నాయి. ఇప్పటి వరకు చేసింది చాలు.. ఇక, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు దృష్టి పెడితే మంచిది”- ఇదీ.. ఇతమిత్థంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు నలుగురు తాజాగా అనంతపురంలో పీసీసీ చీఫ్ షర్మిలకు చేసిన ప్రతిపాదన. వీరిలో ప్రస్తుతం ఓ కీలక పార్టీలో ఉన్న నాయకుడు కూడా ఉండడం గమనార్హం. అతి ఎప్పుడూ మంచిది కాదని వారు తేల్చి చెప్పారు. పైగా మహిళల్లో సానుభూతిని సొంతం చేసుకున్న జగన్‌పై నేరుగా యుద్ధం చేయడం సరికాదని కూడా వారు చెప్పినట్టు తెలిసింది.
ఇతర నేతల్లోనూ.. షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు, ప్రసంగాలు.. గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. “ఒంగోలులో పార్టీకి నాయకులు లేరు. ఉన్నవారంతా అధికార పార్టీలోనే ఉన్నారు. మమ్మల్ని నడిపించేందుకు మాలోనుంచే ఒక నేతను ఎన్నుకోమని మేం చెబుతున్నాం. కానీ, ఎవరూ పట్టించుకోవడం లేదు. షర్మిలమ్మ వచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేసి వెళ్లిపోయారు. పార్టీ పరంగా మాకు ఎలాంటి దిశానిర్దేశం చేయలేదు” అని ఒంగోలుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు మీడియాతోనే చెప్పడం గమనార్హం. ఇక, విజయవాడలోనూ పార్టీకి నాయకులు లేకుండా పోయారు. వాస్తవానికి ఆంధ్రరత్న భవన్‌కు వస్తున్నవారు కూడా.. ఇరుగు పొరుగు జిల్లాలకు చెందినవారే.
అలాగే.. ప్రస్తుతం షర్మిల చేస్తున్న యాత్రల్లోనూ.. స్థానికంగా ఉన్న నాయకులు పెద్దగా లేరు. వేరే జిల్లాల నుంచి వస్తున్నవారే ఉన్నారు. తాజాగా తిరుపతిలో నిర్వహించిన సమావేశానికి స్థానికంగా ఉన్న ఒక కీలక నేత, తరచుగా మీడియా ముందుకు వచ్చే ఆయన డుమ్మా కొట్టారు. ఈయన కోసం వేచి చూసి.. కార్యక్రమాన్ని ముగించారు. ఈ నేపథ్యంలోనే అనంతపురం చేసే సరికి ఈ జిల్లాకుచెందిన సీనియర్ నేతలు.. నలుగురు షర్మిలను కలిసి.. పైవిధంగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వరకు బాగానే ఉందని, కానీ, వ్యక్తిగతంగా జగన్‌ను విమర్శించడంలో డోసు తగ్గించాలని వారు సూచించారు. ఇది పెరిగితే.. ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని వారు చెప్పకనే చెప్పేశారు.
కర్తవ్యం ఏంటి?
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పుంజుకునేలా చేయాలన్న లక్ష్యంతోనే షర్మిల వచ్చి ఉంటే.. ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉంది. దీనికిగాను, ఆమె క్షేత్రస్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసేందుకు సభ్యత్వం పెంచాల్సి ఉంది. అదేవిధంగా పార్టీలో చైతన్యం కలిగించేలా వ్యవహరించాల్సి ఉంది. కానీ, ఆదిశగా ఇప్పటి వరకు షర్మిల చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఆమె పగ్గాలు చేపట్టి పది రోజులు అవుతున్నా.. ఇప్పటి వరకు ఎవరూ ఒక్కరు కూడా వచ్చి పార్టీ కండువా కప్పుకోలేదు. తాను కలుస్తున్నవారు కూడా.. షర్మిలకు ఇదే చెబుతున్నారు. అతిగా దూకుడు ప్రదర్శించవద్దని.. తద్వారా.. పార్టీకి మేలు కలగకపోగా వ్యక్తిగతంగా కూడా నష్టం తప్పదని అంటున్నారు. మరి షర్మిల ఏం చేస్తారో చూడాలి.