క‌రోనా సాయం.. జ‌గ‌న్ హ్యాండ్స‌ప్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి రోజు రోజుకూ ద‌య‌నీయంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. కానీ సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో, జ‌నాల‌కు అవ‌స‌రాన్ని బ‌ట్టి ఆర్థిక సాయాలు ప్ర‌క‌టించ‌డంలో జ‌గ‌న్ స‌ర్కారు ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌ట్లేదు.

క‌రోనా విజృంభ‌ణ నేప‌థ్యంలో కొన్ని నెల‌ల కింద‌ట పాజిటివ్‌గా తేలి కోవిడ్ కేర్ సెంట‌ర్లు, క్వారంటైన్ కేంద్రాల్లో ఉండి చికిత్స తీసుకునే వాళ్ల‌కు రూ.2 వేల ఆర్థిక సాయాన్ని అందించ‌నున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

కొంత కాలం పాటు చెప్పిన‌ట్లే ఆర్థిక సాయం అందించారు కూడా. కానీ త‌ర్వాత‌ ఆ సాయానికి బ్రేక్ ప‌డింది.జులై నుంచే కరోనా బాధితులకు ఈ సాయం అందడం లేదని వెల్ల‌డైంది. ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఏపీలో నెల రోజులుగా రోజుకు అటు ఇటుగా ప‌ది వేల కేసుల దాకా న‌మోద‌వుతున్నాయి. అంటే సాయం కింద రోజుకు రూ.2 కోట్ల దాకా ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తోంది. ఐతే రాష్ట్రంలో ఎంత‌కీ కేసులు త‌గ్గ‌క‌పోవ‌డంతో ఈ భారాన్ని మోయ‌డం క‌ష్ట‌మైపోతోంది.

కేసులు వంద‌ల్లో న‌మోద‌వుతున్న‌పుడు బాగానే సాయం అందించారు కానీ.. ఏకంగా రోజూ ప‌ది వేల స్థాయికి వెళ్లిపోవ‌డంతో నిధుల విడుద‌ల‌కు ఇబ్బంది వ‌చ్చింది. ఏప్రిల్, మే , జూన్ నెలల్లో మాత్రమే ఈ సాయం అందజేశారు. ఇందుకోసం రాష్ట్ర ఆర్ధిక శాఖ దాదాపు 20 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది.

జులై నుంచి సాయం ఆగిపోయింది. కొంచెం ఆల‌స్యంగా అయినా డ‌బ్బులొస్తాయ‌ని ఆశించిన క‌రోనా బాధితుల‌కు నిరాశ త‌ప్ప‌లేదు. క‌రోనా బాధితుల‌కు చెల్లింపులు చేయ‌లేమ‌ని జిల్లా స్థాయిలో అధికారుల‌కు ప్ర‌భుత్వం అధికారికంగా స‌మాచారం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.