నేను అభిమ‌న్యుడిని కాదు.. అర్జ‌నుడిని: సీఎం జ‌గ‌న్‌

“నేను అభిమ‌న్యుడిని కాదు.. ప‌ద్మ‌వ్యూహంలో చిక్కుకుపోవ‌డానికి, అర్జ‌నుడిని. ఎలాంటి యుద్ధంలో అయినా..ఎంత‌టి యుద్ధంలో అయినా.. త‌ట్టుకుని విజ‌యం ద‌క్కించుకున్న అర్జ‌నుడిగా ముందుకు వ‌చ్చాను. కృష్ణుడిలా మీరంతా(ప్ర‌జ‌లు) నాకు అండ‌గా ఉన్నారు. విజ‌యం మ‌న‌దే. 175 కు 175 సీట్ల‌లో విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌న్న అజెండాతో ముందుకు వెళ్తున్నాం” అని సీఎం జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో గ‌ర్జించారు. విశాఖ‌ప‌ట్నం శివారు భీమిలిలోని సింగివ‌ల‌స‌లో తాజాగా నిర్వ‌హించిన వైసీపీ ‘సిద్ధం’ పేరిట నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో సీఎం జ‌గ‌న్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌పై విమ‌ర్శ‌ల‌తోపాటు.. త‌న పార్టీ ల‌క్ష్యాల‌ను కూడా వివ‌రించారు.

చంద్ర‌బాబు ఓడితీరాల్సిందే..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నేత‌ల‌నే కాదు.. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబును కూడా ఓడించి తీరాల్సిందేన‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం స‌హా కాంగ్రెస్ నేత‌ల‌ను ఆయ‌న కౌర‌వుల‌తో పోల్చారు. ఇటు వైపు ఉన్న‌ది పాండ‌వులు. అటు వైపు ఉన్న‌ది కౌర‌వ సైన్యం. మ‌న చుట్టూ ప‌ద్మ‌వ్యూహాలు ప‌న్నుతున్నారు. కానీ, మీ ముందున్న‌ది అభిన్యుడు కాదు.. అర్జ‌నుడు. ఈ అర్జ‌నుడికి తోడు ప్ర‌జ‌లు శ్రీకృష్ణుడు మాదిరిగా ముందుండి న‌డిపిస్తున్నారు” అని అన్నారు. ఈ యుద్ధంలో చంద‌ర‌బాబు స‌హా అంద‌రూ ఓడిపోవాల్సిందే. గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 23 సీట్లుకూడా ఈ సారి చంద్ర‌బాబుకు రాకూడ‌దని తెలిపారు. ప్ర‌స్తుతం టీడీపీలో 175 స్థానాల్లోనూ పోటీ చేసేందుకు అభ్య‌ర్థులే లేర‌ని ఎద్దేవా చేశారు. అందుకే ద‌త్త‌పుత్రుడిని వెంటేసుకుని తిరుగుతున్నార‌ని అన్నారు.

99 శాతం హామీలు పూర్తి

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను 99 శాతం మేర‌కు పూర్తి చేసిన‌ట్టు జ‌గ‌న్ చెప్పారు. గ‌తంలో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల్లో 10 శాతం కూడా అమ‌లు చేయ‌లేద‌న్నారు. అస‌లు అమ‌లు చేయాల‌న్న ఉద్దేశం కూడా లేద‌ని విమ‌ర్శించారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వ‌ర‌కు చంద్ర‌బాబు ఏం చేశారో .. చెప్పుకొనే ధైర్యం కూడా లేద‌ని, అస‌లు చేసిందేమీ లేద‌ని అన్నారు. ‘చేసిన మంచి ప‌నిని న‌మ్ముకునే మీ బిడ్డ మ‌ళ్లీ మీముందుకు వ‌చ్చాడు’ అని చెప్పారు. 56 నెల‌ల కాలంలో సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించామ‌న్నారు. ఎక్క‌డా లంచాలు లేకుండా, వివ‌క్ష‌కు తావురాకుండా పాల‌న సాగించామ‌న్నారు.

ఎన్నెన్నోప‌థ‌కాలు

త‌మ హ‌యాంలో ఎన్నెన్నో ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన‌ట్టు సీఎం జ‌గ‌న్ చెప్పారు. నాడు-నేడు ద్వారా పాఠ‌శాల‌ల రూపు రేఖ‌ల‌ను మార్చామ‌న్నారు. విలేజ్ క్లినిక్‌, ఫ్యామిలీ డాక్ట‌ర్‌, 1వ తేదీ ఉద‌యానిక‌ల్లా పింఛ‌న్లు, ప్ర‌తిగ్రామానికీ డిజిట‌ల్ లైబ్ర‌రీలు, విద్యార్థుల కు బైజూస్ కంటెంట్‌, ట్యాబులు, ఆరోగ్య శ్రీ ప‌రిమితి పెంపు వంటి అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్టు సీఎం జ‌గ‌న్ వివ‌రించారు. ఒక్క వైద్య రంగంలోనే 53 వేల‌కు పైగా నియామ‌కాలు చేప‌ట్టామ‌న్నారు. స్థానిక సంస్థ‌ల ప‌ద‌వుల్లో మ‌హిళ‌ల‌కు పెద్ద‌పీట వేశామ‌ని, రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేశామ‌ని సీఎం జ‌గ‌న్ తెలిపారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీ బిడ్డ‌ను ఆశీర్వ‌దించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.