చంద్ర‌బాబుకు జ‌గ‌న్ ఫ్రీ హ్యాండ్‌.. అదే ఇబ్బంద‌వుతోందా..!

రాజ‌కీయాలు ఒక్కొక్క‌సారి గ‌మ్మ‌త్తుగా ఉంటాయి. కంచంలో అన్నీ వ‌డ్డించిన‌ట్టు క‌నిపిస్తున్నా.. ఏం చేయాలో ఆలోచ‌న త‌ట్టే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్పుడు ఏపీలోనూ.. అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. అధికార పార్టీ వైసీపీని గ‌ద్దె దింపేయాలని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న టీడీపీకి.. కీల‌క‌మైన వ్య‌వ‌హారంలో వైసీపీ నుంచి రూట్ క్లియ‌ర్ అయిపోయింది. సీఎం జ‌గ‌న్‌.. ఒక‌ర‌కంగా.. చంద్ర‌బాబుకు ఫ్రీహ్యాండ్ ఇచ్చేశారు.

అంటే.. వైసీపీని ఓడించాలంటే.. టీడీపీ స‌రైన అభ్య‌ర్థుల‌ను ఎంచుకోవాలి. ఇలా చేయాల‌ని అంటే.. వైసీ పీ ఎవ‌రికి టికెట్లు ఇస్తోందో చూసుకుని… వారిపై అంత‌క‌న్నా బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టాలి. ఇది.. కొంత వ‌ర‌కు విజ‌యం సాధించాల‌న్న ల‌క్ష్యాన్ని చేరువ చేస్తుంది. గ‌తంలో అయితే.. నోటిఫికేష‌న్ వ‌చ్చే వ‌ర‌కు కూడా.. పార్టీలు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించేవి కాదు. దీంతో ప్ర‌త్య‌ర్థి పార్టీ ప‌క్షాన ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు నిల‌బ‌డుతున్నార‌నేది తెలియ‌క‌.. ఇత‌ర పార్టీలు కొంత త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డేవి. దీంతో కొన్ని కొన్ని సంద‌ర్భాల్లో స‌రైన అభ్య‌ర్థులు దొర‌క్క‌.. పార్టీలు కోల్పోయిన నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్నాయి.

అయ్యో.. అక్క‌డ ఈయ‌న‌కు లేదా ఆమె కు చాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది క‌దా! అనే చ‌ర్చ‌లు.. విశ్లేష‌ణలు కూడా వ‌చ్చేవి. కానీ, ఇప్పుడు ఏపీలో ఇలా.. షాకింగ్ డెసిష‌న్లు.. మెరుపులాంటి నిర్ణ‌యాల‌కు తావు లేకుండా.. అధికార పార్టీ వైసీపీ.. నోటిఫికేష‌న్‌కు నెల నెలన్న‌ర ముందుగానే అభ్య‌ర్థుల‌ను దాదాపు ప్ర‌క‌టించేసింది. ఇప్ప‌టికి 60 అసెంబ్లీ, 10 పార్ల‌మెంటు స్థానాల్లో ఇంచార్జ్‌ల‌కు ప‌గ్గాలు ఇచ్చింది. సో.. ఇది వైసీపీకి లాభ‌మా.. లేదా.. అనేది ప‌క్క‌న పెడితే.. ప్ర‌త్య‌ర్థి పార్టీగా ఉన్న టీడీపీకి గొప్ప అవ‌కాశం.

వైసీపీ త‌ర‌ఫున ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు నిల‌బ‌డుతున్నార‌నేది క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు క‌నిపిస్తోంది. దీంతో ఆయా అభ్య‌ర్థుల‌ను దీటుగా ఎదుర్కొనేవారు.. గెలుపు గుర్రాల‌ను ఏరుకుని నిల‌బెట్టే అవ‌కాశం టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ల‌భించింది. ఇది ఒక‌ర‌కంగా.. సీఎం జ‌గ‌న్.. చంద్ర‌బాబుకు ఇచ్చిన ఫ్రీహ్యాండ్ గానే విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఫ‌లితంగా త‌ప్ప‌ల‌కు చాన్స్ లేకుండా.. ప్ర‌త్య‌ర్థి బ‌లాబ‌లాల‌ను అంచనా వేసుకుని ముందుకు సాగే అవ‌కాశం ఉంటుంది. కానీ.. ఎందుకో.. ఇంత‌గా పిక్చ‌ర్ క‌ళ్ల‌ముందు క‌నిపిస్తున్నా.. చంద్ర‌బాబు.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక క్లారిటీకి రాలేక పోతున్నారు. అభ్య‌ర్థుల విష‌యంలో త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతూనే ఉన్నారు. మ‌రి చివ‌ర‌కు ఏం చేస్తారోచూడాలి.