క్రిస్టియ‌న్ సెంట్రిక్ పాలిటిక్స్‌.. ప‌వ‌న్ ఎంట్రీ!

రాష్ట్రంలో గ‌త నాలుగు రోజులుగా క్రిస్టియ‌న్ల కేంద్రంగా రాజ‌కీయాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌ధానంగా కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల బాధ్య‌త‌లు చేప‌ట్టిన తొలిరోజే.. క్రైస్త‌వుల‌ను కార్న‌ర్ చేస్తూ.. కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ క్రైస్త‌వుల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగానే చూస్తోంద‌ని.. మ‌ణిపూర్ రాష్ట్రంలో క్రైస్త‌వుల‌పై ద‌మ‌న కాండ జ‌రిగి, హ‌త్య‌లు.. అత్యాచారాలు జ‌రిగినా.. సీఎం జ‌గ‌న్ క‌నీసం పెద‌వి విప్ప‌లేద‌ని.. ఇదేనా వారిపై ప్రేమ అంటూ ఆమె నిల‌దీశారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపాయి.

ఇక‌, ఇప్పుడు ఇదే విష‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. క్రైస్త‌వుల‌ను సీఎం జ‌గ‌న్ మోసం చేశార‌ని ఆయ‌న కూడా విమ‌ర్శించారు. రాష్ట్రంలో 97 వేల మంది పాస్ట‌ర్లు ఉన్నార‌ని.. వారంద‌రికీ నెల‌వారీ రెమ్యున‌రేష‌న్ ఇస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్ కేవ‌లం 8500 మందికి మాత్ర‌మే ఇచ్చార‌ని.. అది కూడా ఎంపిక చేసిన వారికి మాత్ర‌మే ఇస్తున్నార‌ని.. ఇది మోసం కాదా? మిగిలిన వారి సంగ‌తేంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో టీడీపీ-జ‌నసేన కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే క్రైస్తవులకు మేలు జ‌రిగేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జ‌నసేనాని హామీ ఇచ్చారు. తాజాగా ఆయ‌న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవ మత పెద్దలతో సమావేశం అయ్యారు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ మాట్లాడుతూ.. సీఎం జగన్ తన స్వార్థం కోసం క్రైస్త‌వుల‌ను వినియోగించుకుంటున్నార‌ని వ్యాఖ్యానించారు. తాను క్రిస్టియ‌న్ అని చెప్పుకొనే జ‌గ‌న్‌.. ప్ర‌భువు చెప్పిన ఒక్క సిద్ధాంతాన్ని కూడా అనుస‌రించ‌డం లేద‌ని దుయ్య‌బ‌ట్టారు.

రాష్ట్రంలో క్రైస్త‌వుల హక్కుల పరిరక్షణకు తాను కొమ్ము కాస్తాన‌న్నారు. పాస్టర్లకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ బుట్టదాఖలు చేశారని మండిపడ్డారు. రాజకీయ నేతలు లౌకిక వాదాన్ని కూడా రాజ‌కీయంగా మార్చార‌ని, ఓటు బ్యాంకుగానే చూస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. జగన్ హయాంలో 517 హిందూ దేవాలయాలపై దాడులు జ‌రిగాయ‌ని.. వీటిని క్రైస్తవులే చేయించార‌న్న అభిప్రాయం ఉంద‌ని.. అయిన‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ మాట్లాడ‌లేద‌ని.. మ‌రి క్రైస్త‌వులు ఆయ‌న‌ను ఎందుకు విశ్వ‌సించాల‌ని ప్ర‌శ్నించారు. త‌న‌కు కూడా క్రిస్టియానిటీ అంటే ఎంతో ఇష్ట‌మ‌ని పేర్కొన్నారు. బైబిల్ చ‌దివాన‌ని ప‌వ‌న్ చెప్పారు.