ఏపీ అధికార పార్టీ వైసీపీ వచ్చే ఎన్నికలకు సంబంధించి పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 59 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వక పోవడం.. లేదా.. కొందరిని సెగ్మెంట్లు మార్చడం చేసింది. టికెట్ ఇవ్వని వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చింది. అదేసమయంలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు స్థాన చలనం కల్పించింది. ఇక, ఎంపీల్లోనూ దాదాపు 10 మంది వరకు మార్పులు చేర్పులు చేసింది. ఇది వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంఅయింది.
పలువురు నాయకులు కూడా.. పార్టీకి దూరమయ్యారు. ఇంకొందరు పక్క చూపులు చూస్తున్నారు. మరి .. సీఎం జగన్, వైసీపీ అధినేత ఎందుకు ఇంత సంచలన నిర్ణయం తీసుకున్నారు? దీనివెనుక కారణమేం టనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే.. ఇప్పటి వరకు వైసీపీ దీనిపై పెద్దగా వివరణ ఇవ్వలేదు. కాగా, తాజాగా సీఎం జగన్ తిరుపతిలో నిర్వహించిన.. ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. సీనియర్ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్‌దేశాయ్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు.
“మా ప్రభుత్వం విషయంలో ప్రజలకు మంచి అభిప్రాయం ఉంది. మా పాలనపైనా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది బాగానే ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఆరోపణలు వచ్చాయి. ప్రజలు వారిని కోరుకోవడం లేదు. అందుకే వారిని మార్చాం. ఎన్నికలకు మరో రెండు మాసాల సమయం మాత్రమే ఉంది. అప్పటికప్పుడు..(ఎన్నికలకు ముందు) నిర్ణయాలు తీసుకుంటే.. అదిగందర గోళానికి దారితీస్తుంది. అందుకే ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాం” అని వివరించారు.
అంతేకాదు.. తాము తీసుకున్న నిర్ణయాలతో జరిగిన పరిణామాలు కూడా తమకు తెలుసునని. అన్నింటికీ సిద్ధమయ్యే మార్పులు చేర్పులకు శ్రీకారం చుట్టినట్టు సీఎం జగన్ వివరించారు. వచ్చే ఎన్నికలు ఎంతో ముఖ్యమైనవని, తాము ఎప్పుడూ ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటున్నామని.. ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక ను చేపడుతున్నట్టు సీఎం జగన్ చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates