ఏపీలో అధికార పార్టీ వైసీపీ నేరుగా ప్రజలకు డబ్బులు పంచుతోంది. ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల పైచిలు కు సొమ్మును ప్రజలకు నేరుగా పంపిణీ చేసినట్టు సీఎం జగన్ స్వయంగా చెబుతున్నారు. ఈ లెక్క ఇంకా ఎక్కువగా ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో మరిన్ని పథకాల ప్రకటనకు కూడా వైసీపీ రెడీ అవుతోంది. ఇప్పటికే అమ్మ ఒడి, ఆసరా, నాడు-నేడు, ఇళ్లు వంటి కీలక పథకాలతో వైసీపీ దూకుడుగా ఉంది.
వచ్చే ఎన్నికల్లో వీటిని మించేలా పథకాల రూపకల్పనకు ప్రాధాన్యమిస్తోంది. ఇక, టీడీపీ కూడా ఇప్పటికే ఆరు గ్యారెంటీలు ప్రకటించింది. ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు కూడా. ఉచిత ప్రయాణం, ఉచిత వంట గ్యాస్, నెలనెలా మహిళలకు 1500 రూపాయల చొప్పున నిధులు.. ఇలా దాదాపు ఎక్కువగానే ఉచిత పథకాలు ప్రకటించింది. అయితే.. వీటిలో కొన్ని మార్పులు చేసి.. రేషన్ సరుకులను పెంచాలన్న జనసేన నినాదాన్ని కూడా చేర్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ రెండు పార్టీల విషయం ఇలా ఉంటే.. పథకాల మాట ఎలా ఉన్నా.. పార్టీలకు మహిళలను అధ్యక్షులు గా చేసిన కాంగ్రెస్, బీజేపీలు కూడా.. వచ్చే ఎన్నికలపై కన్నేశాయి. అయితే.. ఈ పార్టీల ఉచితజపాలు, మహిళా అధ్యక్షుల నియామకాల వెనుక.. అసలు రీజన్ ఇప్పుడు తెలుస్తోంది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఓటర్ల జాబితాను ప్రకటించింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో పురుష ఓట్ల కన్నా.. మహిళా ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మొత్తం 4,08,07,256 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 2,07,29,452 మంది కాగా, పురుషుల ఓట్లు 2,00,74,322, ట్రాన్స్‌జెండర్ల ఓట్లు 3,482 ఉన్నాయి.
ఈ నేపథ్యంలో మహిళలను ఆకట్టుకున్న పార్టీలకే అధికారం దక్కుతుందనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయా పార్టీలు మహిళలకు పెద్దపీట వేస్తూ.. ఉచితాల వైపు మొగ్గు చూపుతున్నాయనేది స్పష్టం. పైగా పురుష ఓటర్లలో సగం లేదా పాతిక శాతం మంది అసలు బూతులకు వస్తారో లేదో కూడా తెలియదు. కానీ, మహిళా ఓటర్లు మాత్రం ఖచ్చితంగా వస్తారనే అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలోనే మహిళలకు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారనే విషయం తేటతెల్లమైంది. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates