ఏపీలో ఓ ఎంపీ కుటుంబంలో నలుగురికి కరోనా?

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కరోనా వ్యాపిస్తోన్న తొలినాళ్లలో ఏపీలో పరిస్థితి అదుపులో ఉంది. ఢిల్లీ లింక్ బయటపడ్డ తర్వాత ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 81 పాజిటివ్ కేసులు నమోదు కాగా…మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1097కు చేరింది.

ఇక, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల జాబితాలో టాప్ ప్లేసులో ఉన్న కర్నూలులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కర్నూలులో ఓ ఎంపీ కుటుంబంలో నలుగురు డాక్టర్లు సహా ఆరుగురికి కరోనా సోకిందని తెలుస్తోంది కర్నూలులో రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కర్నూలులో 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 279 కి చేరింది.

కరోనా బారిన పడి 9మంది మరణించారు. 31మంది డిశ్చార్జ్ అయ్యారు. మొదట పెద్దగా కేసులు లేని కర్నూలులో కరోనా చాపకింద నీరులా వ్యాపించింది. అతి తక్కువ కేసులు నమోదైన జిల్లాగా ఉన్న కర్నూలు రోజుల వ్యవధిలోనే అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా మారడం చర్చనీయాంశమైంది.

కర్నూలులో ఓ ఎంపీ కుటుంబంలో నలుగురు డాక్టర్లు సహా ఆరుగురికి కరోనా సోకిందని తెలుస్తోంది. ఆ ఎంపీ కూతురికి రావడంతో ఎంపీ కుటుంబాన్ని కూడా హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పెట్టారని తెలుస్తోంది. ఇప్పటిదాకా కర్నూలులో మొత్తం 7గురు డాక్టర్లకు కరోనా సోకింది. వారిలో ఒక డాక్టర్ మరణించారు.

కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు కూడా కరోనా సోకిందన్న వదంతులు వస్తున్నాయి. అయితే, సదరు ఎమ్మెల్యేకు ఇంకా కరోనా నిర్ధారణ టెస్టులు చేయలేదని, ప్రస్తుతం హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలోని క్వారంటైన్లో ఆ ఎమ్మెల్యే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కర్నూలు, నంద్యాలలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. మిగతా ప్రాంతాల్లో కరోనాను కట్టడి చేశారు.

ఆత్మకూరు, నందికొట్కూర్, బనాగానపల్లె…కంట్రోల్ లోకి వచ్చాయి. కర్నూల్, నంద్యాలలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి రావడం లేదు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.