టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా కడప జిల్లాలోని కీలకమైన కమలాపురం నియోజకవర్గంలో రా..కదలిరా ! సభలో ఆద్యంతం ఆసక్తిగా మాట్లాడారు. అధికార పార్టీ వైసీపీపై ఆసాంతం ఆయన సైటర్లతో విరుచుకుప డ్డారు. “వైసీపీ అంటే.. ఏంటి తమ్ముళ్లు.. రిబ్బన్‌లు-రంగులు-బొమ్మలు.. అంతేగా!” అని వ్యాఖ్యానించడం తో సభ చప్పట్లతో మార్మోగింది. వైసీపీ హయాంలో కడప స్టీల్ ప్లాంట్‌ను నిర్మించేస్తామని.. లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం జగన్ చెప్పారని.. అయితే.. ఆయన ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికి రెండు సార్లు రిబ్బన్లు కట్ చేశారని వ్యాఖ్యానించారు.
“ఇది రిబ్బన్ల ప్రభుత్వం” అంటూ చంద్రబాబు సటైర్లు వేశారు. అన్నింటికీ ఒకటికి రెండు సార్లు రిబ్బన్లు కట్ చేసి.. కలరింగ్ ఇచ్చుకోవడం.. సీఎం జగన్ మోహన్‌రెడ్డికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. ఇక, రంగుల విషయంపై మాట్లాడుతూ.. “వైసీపీ జెండా రంగులను స్కూళ్లకు వేస్తున్నారు. వద్దని ఎవరైనా అంటే.. కేసులు పెట్టి బొక్కలో వేస్తున్నారు. సాక్షత్తూ కోర్టులే మొట్టికాయలు వేసినా.. వీళ్లకి బుద్ధి రావడం లేదు. జగన్‌కు రంగుల పిచ్చి. చివరకు పిల్లలకు ఇచ్చే స్కూల్ బ్యాగులు, ఆట వస్తువులపైనా.. పార్టీ రంగులు వేశారు” అని ఎద్దేవా చేశారు.
ఇక, బొమ్మల విషయాన్ని ప్రస్తావిస్తూ.. చంద్రబాబు మరిన్ని జోకులు పేల్చారు. “ప్రజలకు ఇచ్చే పట్టాలపైనా.. జగన్ బొమ్మ వేసుకుంటున్నారు. ఆఖరికి డెత్ సర్టిఫికెట్‌పైనా.. ఆయన బొమ్మే ఉంటోందని మా వాళ్లు చెప్పారు. రైతులకు ఇచ్చే భూములకు వేసే సరిహద్దు రాళ్లపైనా జగన్ బొమ్మ వేసుకున్నాడు. రేషన్ వాహనాలపైనా ఆయన బొమ్మలే వేసుకుంటున్నారు. ఆఖరికి ఇంటింటికీ.. తలుపులపైనా ఆయన బొమ్మలు వేసుకున్నాడు” అని దుయ్యబట్టారు”. వైసీపీ అంటే.. రిబ్బన్‌లు-రంగులు-బొమ్మలు.. అంటూ పదే పదే ఎద్దేవా చేశారు.
పోటెత్తిన జనం..
వాస్తవానికి కమలాపురం నియోజకవర్గంలో వరుస విజయాలు వైసీపీవే. ఇక్కడ నుంచి జగన్ సొంత మేన మామ(మాతృమూర్తి విజయమ్మ తమ్ముడు) పి. రవీంద్రనాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో రా..కదలిరా.. సభపై పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. కానీ, సభకు భారీ ఎత్తున జనాలు తరలి రావడంతో చంద్రబాబు ఉబ్బితబ్బిబ్బయ్యారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates