వచ్చే ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన హామీ ఇచ్చారు. నిజానికి ఇప్పటికే మినీ మేనిఫెస్టో రూపంలో ఆరు గ్యారెంటీలను చంద్రబాబు ప్రకటించారు. అయితే.. పూర్తిస్థాయిలో హామీల విషయంలో ఇంకా ఆయన కసరత్తు చేస్తున్నారు. వీటిలో తాజాగా చంద్రబాబు ప్రకటించిన హామీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉమ్మడి కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన రా.. కదలిరా! సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ నియోజకవర్గానికి వైసీపీ అధినేత జగన్ సొంత మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. వచ్చే ఐదేళ్లపాటు కరెంటు చార్జీలను పెంచేది లేదని.. పెంచబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. అదేసమయంలో ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను మరో 50 యూనిట్లకు పెంచనున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఈ రెండు హామీలు కూడా.. సంచలనమనే చెప్పాలి. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇప్పటికి 4 దఫాలుగా విద్యుత్ చార్జీలను పెంచింది. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల విద్యత్‌ను అమలు చేస్తోంది.
అయితే.. వీటిలోనూ ట్యాక్సులు కడుతున్నారన్న మిషతో.. చాలా కనెక్షన్లకు ఉచిత విద్యత్ సౌకర్యాన్ని తీసివేసింది. దీంతో ఆయా వర్గాలు సాధారణ జనాల మాదిరిగానే బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజా ప్రకటన ఆయా వర్గాలకు ఉపశమనంగా మారనుంది. అదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు .. చార్జీలు పెంచబోమన్న హామీ మరింత ఆనందం కలిగించనుంది. ఇక, మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు సర్వీసును అందుబాటులోకి తీసుకురానున్న విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates