వైసీపీ రెబల్ ఎంపీ, నరసాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణరాజు తాజాగా వైసీపీపై సటైర్లు వేశారు. తనకు టీడీపీ-జనసేన మిత్రపక్షం టికెట్ ఇచ్చేందుకు నిరాకరిస్తోందని వైసీపీలో కొందరు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అయితే.. వాస్తవానికి ఈ సీటు ఎప్పుడో తనకే రిజర్వ్ అయిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన మిత్రపక్షం తరఫున తాను నరసాపురం ఎంపీ సీటు నుంచే పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంలో రెండో మాటేలేదన్నారు.
“అయితే.. అసలు విషయం ఏంటంటే.. నాపై పోటీ చేసేందుకు వైసీపీకే అభ్యర్థులు లేరు. ఎవరు పోటీ చేస్తారు? అందరికీ తెలుసు.. ఎవరికి టికెట్ ఇచ్చినా.. ఇక్కడ చిత్తుచిత్తుగా ఓడిపోతారని. అందుకే ఎవరూ ముందుకు రావడం లేదు. కాబట్టి.. ముందు వైసీపీ.. నాపై పోటీ చేసే అభ్యర్థిని వెతుక్కుంటే మంచిది” అని సూచించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని రఘురామ సూచించారు. ఇలాంటి గాలి ప్రచారాలు టీడీపీ-జనసేన మిత్రపక్షాన్ని ఏమీ చేయబోవన్నారు.
ఇప్పటికే స్థానిక టీడీపీ – జనసేన నేతలతో తాను భేటీ అయ్యాయని.. వచ్చే ఎన్నికల గురించి చర్చించా మని రఘురామ చెప్పారు. అందరూ కలసి కట్టుగా ఉండి.. వచ్చే ఎన్నికల్లో మిత్రపక్షాన్ని గెలిపించేందుకు ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. వైసీపీ నూటికి నూరుపాళ్లు అధికారం కోల్పోతుందని రఘురామ వెల్లడించారు. వచ్చే ఎన్నికలు దోపిడికీ-అబివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. విజన్-అభివృద్ది-సంక్షేమ కాన్సెప్టుతో టీడీపీ-జనసేన మిత్ర పక్షం పోటీ చేస్తోందన్నారు.
ఈ నెలాఖరులో టికెట్లు ఖరారు: జనసేన
మరోవైపు ఈ నెల ఆఖరులో టికెట్‌పై ప్రకటన వస్తుందని జనసేన తెలిపింది. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జి నాదెండ్ల మనోహర్.. ఈ మేరకు ప్రకటించారు. ఇప్పటికే కసరత్తు పూర్తయిందని.. తుదిదశలో ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో సాధ్యమైనంత వరకు ఆశావహులకు టికెట్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తు న్నామని తెలిపారు. అయితే.. ఎవరికైనా టికెట్ రానంత మాత్రాన.. గాబరా చెందాల్సిన అవసరం లేదని.. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చాక.. నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆయన చెప్పారు. ఏదేమైనా ఈ నెల ఆఖరు నాటికి టికెట్ల కేటాయింపు పూర్తవుతుందన్నారు.