అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు వచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పాత్రను కూడా కూటమి పార్టీల ఎమ్మెల్యేలే పోషిస్తున్నారు. ప్రతి రోజూ అసెంబ్లీలో జరిగే ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతున్నారు.
ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన కీలక ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇస్తూ.. చమత్కరించారు. “అధ్యక్షా ప్రతిపక్షం లేని లోటును మన ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. మనోళ్ల ప్రశ్నలే ఇంత ఘాటుగా ఉంటాయని ఊహించలేదు. మంచిదే అధ్యక్షా“ అని అనడంతో స్పీకర్ సహా అందరూ ఫక్కున నవ్వేశారు. ఇంతకీ ప్రశ్న.. ఏంటంటే.. “రాష్ట్రంలో ఎంత మందికి నైపుణ్యాభివృద్ధి కింద శిక్షణ ఇస్తున్నారు?“ అనే.
దీనిని టీడీపీ ఎమ్మెల్యేలు.. యార్లగడ్డ వెంకట్రావు(గన్నవరం), కన్నా లక్ష్మీనారాయణ(సత్తెనపల్లి) ప్రశ్నించారు. దీనిపై మంత్రి లోకేష్ సమాధానం ఇస్తూ.. ఎన్నికలకు ముందు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా యువతకు.. నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలోనే పెట్టుబడులు సాకారం అవుతాయని.. ఆయా కంపెనీల్లో వీరికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఉద్యోగాల కల్పన రంగాలకు సంబంధించి వివిధ సెక్టార్లను ఏర్పాటు చేశామని.. వీటిపై మంత్రి వర్గ ఉప సంఘం కూడా కసరత్తు చేస్తోందని మంత్రి వివరించారు. అభ్యర్థుల నైపుణ్యాలను అనుసరించి ఆయా రంగాల్లో వారికి ఉద్యోగాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేసమయంలో నియోజకవర్గాల వారీగా 1500 లకు పైగా జాబ్ మేళాలు నిర్వహించామన్నారు. వాటి ద్వారా లక్ష మందికిపైగా ఉద్యోగాలు పొందారని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates