మాకు ప్రచారం కాదు.. ఫలితం కావాలి. మీకు ఫలితంతో పనిలేదు.. ప్రచారం కావాలి- తాజాగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీని ఉద్దేశించి అధికార పార్టీ వైసీపీ చేసిన వ్యాఖ్యలు. దీనికి ప్రతిగా.. టీడీపీ నాయకులు కూడా అదే రేంజ్‌లో విమర్శలు చేశారు. మేం ప్రచారం-ఫలితం రెండు దక్కించుకున్నాం.. అని ఎదురు దాడికి దిగారు. గత 24 గంటలుగా ఇరు పార్టీల సోషల్ మీడియాలోనూ ఇదే వార్ జరుగుతోంది. దీంతో ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న పొలిటికల్ సెగ మరింత పెరిగినట్టయింది.
విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం దావోస్‌లో అంతర్జాతీయ వాణిజ్యసదస్సు జరుగుతోంది. ఇది ప్రతి ఏటా జనవరిలో జరిగే కార్యక్రమమే. అయితే.. ఈ సదస్సుకు పొరుగున ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా అదానీ సహా పలు కంపెనీలతో ఆయన ఒప్పందాలు చేసుకున్నారు. ఇవి ప్రముఖంగా వెలుగు చూశాయి. దీంతో ఏపీలో ఏం జరుగుతోందనే విషయం కూడా ఆరా వచ్చింది. ఏపీ సీఎం జగన్ కానీ, ఆయన మంత్రులు కానీ, దావోస్‌వైపు చూడలేదు.
ఎన్నికలకు ముందు ఎందుకులే అనుకున్నారో.. లేక అధికారులను ఎవరినైనా పంపించారో తెలియదు కానీ.. దావోస్‌లో జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్య సదస్సును లైట్ తీసుకున్నారు. ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ.. టీడీపీ నిప్పులు చెరిగింది. ఏపీ సీఎం జగన్‌కు రాష్ట్ర అభివృద్ది అంటే.. పట్టడం లేదని.. ఆయనకు దావోస్ గురించి.. అభివృద్ధి గురించి తెలియదని విమర్శలు గుప్పించింది. దీనికి ప్రతిగా.. వైసీపీ నుంచి ఎదురుదాడి ఎదురైంది.
గత ఏడాది జరిగిన దావోస్ సదస్సుకు సీఎం జగన్ హాజరైన దృశ్యాలు, వీడియోలను షేర్ చేస్తూ.. టీడీపీ పై విమర్శలు గుప్పించింది. విశాఖలో నిర్వహించిన సదస్సులో 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించామని.. తమకు ప్రచారంతో పనిలేదని.. ఫలితాలు మాత్రమే కావాలని సటైర్లు వేసింది. కానీ, టీడీపీ నేతలు మాత్రం దావోస్‌కు వెళ్లి.. ఏం తెచ్చారో చెప్పుకోలేక.. అప్పటి ఫొటోలు వీడియోలు చూపిస్తూ.. ప్రచారం చేస్తున్నారని.. ఎద్దేవా చేసింది. దీనిపై టీడీపీ కూడా అదే రేంజ్‌లో విమర్శలు గుప్పించింది. మొత్తంగా ఎన్నికలకు ముందు దావోస్. . వ్యవహారం ఇరు పార్టీల మధ్య రాజకీయ చర్చకు వివాదానికి దారి తీయడం గమనార్హం.