చిన్న నేత‌.. వైసీపీకి గ‌ట్టి దెబ్బే..

ఎన్నిక‌ల‌కు ముందు.. ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీల‌క వికెట్ ప‌డిపోయింది. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు, విశాఖ ప‌ట్నం జిల్లా ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం నేత సీతంరాజు సుధాక‌ర్ వైసీపీకి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌కు చైర్మ‌న్‌గా ఉన్నారు. అయితే.. ఆయ‌న విశాఖ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ను ఆశించారు. కానీ, టీడీపీలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో గెలిచిన వాసుప‌ల్లి గ‌ణేశ్‌.. వైసీపీలోకి రావ‌డంతో ఆయ‌నకు పార్టీ టికెట్ కేటాయించింది.

దీంతో అలిగిన సీతంరాజు కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో ఆయ‌న‌ను బుజ్జ‌గించే ప్ర‌య‌త్నా లు కూడా జ‌రిగాయి. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్ తో పాటు.. పార్టీ గెలిచిన త‌ర్వాత ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. సీతంరాజు వినిపించుకోలేదు. తాజాగా ఆయ‌న వైసీపీకి రాజీనా మా ప్ర‌క‌టించారు. అయితే.. సీతం రాజు ఎఫెక్ట్ పార్టీపై ఎంత ఉంటుంది? అనేది ఆస‌క్తిగా మారింది. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణుకు ఇప్ప‌టికే టికెట్ లేకుండా పోయింది.

విజ‌య‌వాడ సెంట్రల్ నియోక‌వ‌ర్గం నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న మ‌ల్లాదికి ఈ ద‌ఫా టికెట్ లేకుండా చేశారు. ఇది బ్రాహ్మ‌ణ సామాజిక‌వ ర్గంలో ఆగ్ర‌హం తెప్పించింది.ఇ క‌, ఇప్పుడు ఇదే సామాజిక వ‌ర్గానికి చెందిన సుధాక‌ర్‌ను కూడా ప‌క్క‌న పెట్ట‌డం.. అస‌లు ఎమ్మెల్యే రేసులో లేకుండా చేయ‌డం.. ఈ వ‌ర్గంలో ఆవేద‌న క‌లిగిస్తోంది. మ‌రోవైపు.. గ‌త 2022లో జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో విశాఖ‌లో టీడీపీ ఓట‌మికి సీతంరాజు బ‌లంగా ప‌నిచేశారు.

దీంతో వైసీపీ ఇక్క‌డి కార్పొరేష‌న్‌ను చేజిక్కించుకుంది. విశాఖ న‌గ‌రం ప‌రిధిలోనూ సీతంరాజుకు మంచి పేరుంది. దీంతో ఆయ‌న ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు. పైగా.. ఆయ‌నే స్వ‌యంగా 12 మంది కార్పొరేట‌ర్ల‌ను త‌న వెంట తీసుకువెళ్లాన‌ని అన్నారు. దీంతో విశాఖ కార్పొరేష‌న్ కూడా.. వైసీపీ నుంచి టీడీపీకి ద‌క్కే చాన్స్ క‌నిపిస్తోంది. మొత్తంగా.. చిన్న నేతేలే అని కొట్టిపారేసినా.. గ‌ట్టి దెబ్బే వేసేలా క‌నిపిస్తున్నాడ‌ని వైసీపీలోనే ఓ వ‌ర్గం అంటోంది.