ఉరుములేని పిడుగు అన్నట్లుగా సడెన్ గా కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీచేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు మంగళవారం హాజరవ్వాలంటు నోటీసులో ఈడీ చెప్పింది. కవిత ఏమిచేస్తారాన్నది వేరే విషయం. ఎందుకంటే విచారణను ఎలాగైనా తప్పించుకోవాలని కవిత శతవిధాల ప్రయత్నిస్తున్నారు. దీనికి ఒక సాకును చూపిస్తున్నారు. అదేమిటంటే మహిళలను విచారణ చేయాలంటే ఆపీసులకు పిలిపించకూడదట. అధికారులే ఇళ్ళకొచ్చి మహిళలను విచారించాలని రూల్ ఉందట. ఇదే విషయమై కవిత కోర్టులో పిటీషన్ కూడా వేశారు.
అయితే ఇలాంటి రూల్ ఏమీలేదని, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని విచారించాలన్నా, లేదా వయసు అయిపోయిన వారిని విచారించాలన్నపుడు మాత్రమే ఇంటికి వెళ్ళే విషయాన్ని పరిశీలిస్తామని ఈడీ వాదిస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న 78 ఏళ్ళ సోనియాగాంధి కూడా విచారణకు తమ ఆఫీసుకు వచ్చిన విషయాన్ని ఈడీ కోర్టుకు గుర్తుచేసింది. కవిత వాదన ఎలాగున్నా అసలు ఇప్పటికిప్పుడు కవిత ఈడీ ఎందుకు నోటీసు జారీచేసినట్లు ? ఎందుకంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో లబ్దిపొందటానికే అనే ప్రచారం పెరిగిపోతోంది.
ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణాలో బీఆర్ఎస్, బీజేపీ ఒకటే అనే ప్రచారం మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ఎఫెక్టుచూపింది. బీఆర్ఎస్ ఓటమికి ఈ ప్రచారం కూడా ఒక కారణం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలకపాత్రదారుగా ఆరోపణలున్నా కవితను అరెస్టు చేయకపోవటమే దీనికి ఉదాహరణగా కాంగ్రెస్ ప్రచారంచేసింది. ఈ ప్రచారం వల్ల బీజేపీ కూడా బాగానే నష్టపోయింది. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకుని మోజారిటి సీట్లు గెలుచుకోవాలన్నది బీజేపీ టార్గెట్. తమకు బీఆర్ఎస్ కు సంబంధంలేదని నిరూపించుకోవాల్సిన అవసరం బీజేపీ పైన పడింది.
అందుకనే అర్జంటుగా కవితకు ఈడీతో నోటీసులు ఇప్పించిందనే ప్రచారం పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో లబ్దిపొందటానికి అవసరమైతే కవితను అరెస్టు చేయించే అవకాశాలను కూడా కొట్టిపారేసేందుకు లేదు. అందుకనే కవితకు ఇపుడు వచ్చిన నోటీసులు అచ్చంగా రాజకీయపరమైన ఎన్నికల నోటీసేనా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి దీనికి కవిత, ఈడీయే సమాధానం చెప్పాలి.